ఆర్య, ఆర్య 2 లాంటి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు బన్నీ పుట్టినరోజు కావడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఉదయం 9 గంటలకు ఇస్తామని ప్రకటన చేసింది. కానీ కొందరు ఆ అప్ డేట్ ను ముందుగానే లీక్ చేయడంతో చిత్ర యూనిట్ తీవ్ర ఆగ్రహానికి గురైందని సమాచారం. 
 
ఈ సినిమాకు చిత్ర యూనిట్ 'పుష్ప' అనే పేరు పెట్టిందని.. ఈ సినిమాలో హీరో పేరు పుష్పక్ నారాయణ్ అని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు రావడంతో చిత్ర యూనిట్ షాక్ కు గురైంది. బన్నీ పుట్టినరోజు కానుకగా టైటిల్ ప్రకటించాలని అనుకుంటే... ఇలా టైటిల్ లీక్ కావడంతో నిర్మాతలు టైటిల్ లీక్ చేసిన వారిని కనిపెట్టే పనిలో పడ్డారని సమాచారం. టైటిల్ లీక్ కావడానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చిత్ర యూనిట్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
ఈ సంవత్సరం అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూడో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో ఈ సినిమాలో కనబడతాడని సమాచారం. 
 
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బన్నీకి జోడీగా రష్మిక మందన్న ఈ సినిమాలో నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించనుండగా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంటుంది. చిత్ర యూనిట్ ఈరోజు 9 గంటలకు పుష్ప అనే పేరునే ప్రకటిస్తుందో లేదో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: