చెన్నై: తమిళనాడు  ప్రభుత్వం ఇటీవల సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీని 50 శాతం నుంచి 100 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై అనేక మంది నుంచి విమర్శలు కూడా రావడం, కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కూడా చూశాం. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. పొంగల్ కానుకగా ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతపతి కలిసి నటించిన మాస్టర్ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికి కలెక్షన్లలో మాత్రం ఎటువంటి మార్పు కనిపించడం లేదు. కలెక్షన్లలో ఈ మూవీ కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

కరోనా మహమ్మారి కారణంగా చాలా నెలల తరువాత ఒక పెద్ద సినిమా విడుదల కావడంతో విజయ్ అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దక్షిణాదిన అన్ని భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో మాస్టర్ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చినప్పటికి ఈ రాష్ట్రాల్లోనూ కలెక్షన్ల విషయంలో మాస్టర్ దుసుకుపోతోంది. సినిమా విడుదలై వారం రోజులు గడిచినప్పటికి, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీనే ఉన్నప్పటికి వస్తున్న కలెక్షన్లను చూసి తమిళ ఇండస్ట్రీ ఆశ్చర్యానికి లోనవుతోందట. మూడు రోజుల్లోనే ఈ చిత్రం వంద కోట్ల కలెక్షన్లను దాటేసిన విషయం తెలిసిందే. భారత దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మాస్టర్ కొత్త రికార్డులను నెలకొల్పినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది.

జనవరి 15 నుంచి 17 వరకు అమెరికాలో మాస్టర్ చిత్రం 23 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టిందట. ఇతర ఏ హాలీవుడ్ చిత్రానికి ఈ స్థాయిలో ఆ మూడు రోజుల్లో కలెక్షన్లు రాకపోవడం విశేషం. మాస్టర్ కలెక్షన్ల తర్వాత ‘ఎ లిటిల్ రెడ్ ఫ్లవర్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ మూడు రోజుల్లో 11.75 మిలియన్ యూఎస్ డాలర్ల కలెక్షన్లను సాధించినట్టు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: