మళయాల నటుడు మోహన్ లాల్. అలా అనడం కంటే.. ఆలిండియా నటుడు మోహన్ లాల్ అనడం కరెక్టేమో. అవును, మోహన్ లాల్ క్రేజ్ బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోదు. 4సార్లు జాతీయ అవార్డులు అందుకున్న సత్తా ఉన్న మళయాల క్రేజీ హీరో మోహన్ లాల్. 60ఏళ్లు దాటినా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోని సినిమాలు చేస్తుంటారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

 

మోహన్ లాల్ నటుడే కాదు, మంచి నిర్మాత, స్టేజ్ ఆర్టిస్ట్, గాయకుడు కూడా. నిర్మాతగానూ ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా ఆయన సొంతమయ్యాయి. ఆమధ్య తెలుగులో చేసిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో.. ఆయన సినిమాలు వరుసగా తెలుగులోకి అనువాదం అయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, దక్షిణాది అన్ని భాషల్లోనూ ఆయనకు అభిమానులున్నారు, ఇండస్ట్రీల్లో ఆయనకు మంచి మిత్రులున్నారు. వారంతా ఇప్పుడు మోహన్ లాల్ కి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.


 

సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా నాటకాలను ఆయన ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. నాటక రంగంలో ఎంతోమందిని ప్రోత్సహించారు, ఇప్పటికీ నాటకాలు వేస్తుంటారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వం తరపున గుడ్ విల్ అంబాసిడర్ గా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇక మోహన్ లాల్ సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇండియన్ ఆర్మీలో పనిచేసే అత్యుత్తమ గౌరవాన్ని కూడా ఆయన అందుకున్నారు.

1960 మే 21న కేరళలోని ఎలంతూర్ లో పుట్టిన మోహన్ లాల్ కి ఇది 61వ పుట్టినరోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సహా ఇతర అన్ని భాషల సినీపరిశ్రమలకు చెందినవారు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ రోజు మోహన్ లాల్ టాప్  ట్రెండింగ్ లో కనిపిస్తున్నారు. కుర్రహీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ ఆయన ఎంపిక చేసుకుంటున్న సబ్జెక్ట్ లు ఇతర భాషల హీరోలకి కూడా ఆదర్శం. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, మోహన్ లాల్ హీరోగా నటించిన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: