NTR30: పనులు జరుగుతున్నాయ్.. కంగారు పడకండి ఫ్యాన్స్?

యంగ్  టైగర్  జూనియర్  ఎన్టీఆర్ 30వ సినిమా విషయంలో చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటిదాకా ఆ సినిమా సెట్స్ మీదికే వెళ్లలేదు. 'ఆర్ఆర్ఆర్' పని పూర్తి చేసి ఏడాది కిందటే తారక్ ఫ్రీ అయిపోయినా ఇప్పటిదాకా తర్వాతి చిత్రాన్ని మొదలుపెట్టకపోవడంపై అభిమానులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.'జనతా గ్యారేజ్' లాంటి సూపర్  హిట్ తర్వాత మళ్లీ కొరటాల శివతో జూనియర్  ఎన్టీఆర్  సినిమా చేయబోతున్నాడని ముందు అభిమానులు చాలా ఆనందమయం అయ్యారు కానీ.. గత కొన్ని నెలల్లో పరిణామాలు చూశాక మాత్రం వారిలో కంగారు మొదలైంది.కొరటాల శివ చివరి సినిమా 'ఆచార్య' డిజాస్టర్ కావడం, తారక్ కోసం స్క్రిప్టు తయారు చేసే పని ఎంతకీ తెగకపోవడం, ఈ స్క్రిప్టు సంతృప్తికరంగా రాలేదన్న ఊహాగానాలు తారక్ అభిమానులను టెన్షన్ పెడుతున్నాయి. అసలీ సినిమా ఉంటుందా అన్న సందేహాలు కూడా ఒక దశలో వ్యక్తమైనప్పటికీ.. తారక్ దీనికే కట్టుబడి ఉన్నాడన్న సంకేతాలే అతడి వైపు నుంచి వచ్చాయి.


ఇలాంటి టైంలో ఎన్టీఆర్-కొరటాల సినిమా గురించి అప్‌డేట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో అందరూ హోరెత్తించేశారు. ఈ సినిమాకు టైటిల్ ఏమైనా ఖరారు చేశారేమో.. లేక ఫలానా రోజు సినిమా మొదలవుతుందని చెబుతారేమో అని అనుకుంటే.. చివరికి అలాంటిదేమీ లేకపోయింది. ఈ సినిమా క్యాన్సిల్ కాలేదు, త్వరలోనే మొదలవుతుంది అన్నదే ఈ అప్‌డేట్. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలులతో కలిసి ప్రి ప్రొడక్షన్ పనులను కొరటాల పూర్తి చేసినట్లు, నవంబరు నెలాఖరు నుంచి ఈ సినిమా కోసం అనిరుధ్ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెడతాడని కూడా సమాచారం ఇచ్చారు.ఇంకా ఎన్నాళ్లు తారక్ సమయాన్ని వృథా చేస్తారు.. సరిగ్గా సినిమాను ఎప్పుడు మొదలుపెడతారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో చెప్పాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: