మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న చిత్రం పైన ఎప్పటినుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకి అధికారిక టైటిల్‌ను ఖరారు చేశారు. ముందే ప్రచారంలో ఉన్నట్లుగా, ఈ సినిమాకు “మన శంకరవరప్రసాద్‌గారు” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఉపశీర్షికగా “పండగకి వస్తున్నారు” అని జోడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిరంజీవి కెరీర్‌లో పొడవైన టైటిల్స్ చాలా అరుదు. గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య లాంటి టైటిల్స్ తర్వాత ఇంత లెంగ్త్ టైటిల్ ఇది కావడం విశేషం. టైటిల్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. 156 సినిమాలు చేసిన చిరంజీవిని కొత్తగా ప్రెజెంట్ చేయడం అంత సులభం కాదు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి సింపుల్ కానీ ఎఫెక్టివ్ ఐడియాను వాడాడు. చిరంజీవి వింటేజ్ ఛార్మ్‌ను రీకట్ చేసి చూపించడమే ఆ ఐడియా. గ్లింప్స్‌లో డైలాగులు లేక‌పోయినా మెగాస్టార్ సిగ్నేచర్ స్టయిల్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, గ్లామర్ స్క్రీన్‌పై మెరిపించాయి.


ముఖ్యంగా కొండవీటి దొంగలో గుర్తుండిపోయే గుర్రం పోజ్‌ని రీక్రియేట్ చేయడం అభిమానులను ఒక్కసారిగా ఆ కాలానికి తీసుకెళ్లిపోయింది. అలాగే ఈ గ్లింప్స్‌లో చిరంజీవి లుక్‌ కూడా పెద్ద హైలైట్. గెటప్ చూస్తే ఒక సెక్యూరిటీ ఏజెన్సీ బాస్‌లా కనిపించడం, ఆయన వ్యక్తిత్వాన్ని మరో కోణంలో చూపించింది. మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ చిన్న వీడియోలోనే స్పష్టమైంది. ఈ సినిమాకు మరో ఆకర్షణ వెంకటేశ్‌ అతిథి పాత్ర. ఇప్పటికే ఇది ఫిక్స్ అయ్యింది. అయితే సర్‌ప్రైజ్‌గా ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం టైటిల్ గ్లింప్స్‌కి అదనపు రేంజ్ ఇచ్చింది. చిరు - వెంకీ ఫ్రెండ్షిప్ బాండ్, వారి స్క్రీన్ కెమిస్ట్రీ ఎప్పుడూ అభిమానులకు ప్రత్యేకమే.


అనిల్ రావిపూడి ఆడియన్స్ పల్స్‌ను అద్భుతంగా పట్టుకునే దర్శకుడు. ఎంటర్టైనింగ్ స్టైల్‌లో సినిమాలు తీయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన సినిమాలు సాధారణ ప్రేక్షకుల్నీ, ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఆకట్టుకునే మాస్ +  క్లాస్ మిక్స్‌డ్‌తో ఉంటాయి. ఇంతకు ముందు సంక్రాంతి వస్తున్నాం లాంటి ఎంటర్‌టైనర్ ఎంత హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు “మన శంకరవరప్రసాద్‌గారు”లో రిపీట్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో పెరిగింది. సంక్రాంతి సీజన్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం, చిరంజీవి ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు, మొత్తం తెలుగు ప్రేక్షకులకు పండగ వాతావరణం కలిగించనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: