రాజమౌళి కుటుంబం మొత్తం సినీ పరిశ్రమలో ప్రతిభకు మరో పేరు. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరూ తమ తమ రంగాల్లో అసాధారణ ప్రతిభను కనబరిచారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎప్పటికీ గుర్తుంచుకునే కథలు రాసిన గొప్ప రచయిత. ఆయన కలం నుంచి వచ్చిన బాహుబలి, భజరంగీ భాయీజాన్, రౌద్రం రణం రుధిరం వంటి సినిమాలు భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాయి. ఇక రాజమౌళి సోదరుడు ఎం.ఎం.కీరవాణి సంగీత ప్రపంచంలో ఎందరో మంత్రముగ్ధులను చేసిన మాయగాడు. ఆయన కంపోజ్ చేసిన అనేక హిట్ ఆల్బమ్స్ ఇప్పటికీ అభిమానులకి ప్రియమైనవే. మరొక వైపు రాజమౌళి సతీమణి రమ తన కాస్ట్యూమ్ డిజైనింగ్‌తో మంచి గుర్తింపును సంపాదించారు.
ఈ జాబితాలో మరో ప్రతిభావంతుడు కళ్యాణి మాలిక్, సంగీత దర్శకుడిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వీళ్లంతా ప్రముఖులు అయినప్పటికీ, అదే స్థాయి గుర్తింపు ఇంకా రావలసిన వ్యక్తి రాజమౌళి మరో సోదరుడు ఎస్.ఎస్. కాంచి. ఎన్నో ప్రతిభలు ఉన్న ఆయన బయట అంతగా పాపులర్ కాలేదు. అమృతం సీరియల్‌లో తన హాస్యభరిత పాత్రతో కాంచి అందరి దృష్టిని ఆకర్షించాడు. తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించాడు. తాజాగా వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమాతో అతడికి మంచి గుర్తింపూ, బ్రేక్ కూడా లభించింది. నటుడిగానే కాక, కాంచి ఒక అద్భుతమైన రచయిత మరియు దర్శకుడు కూడా. రాజమౌళి దర్శకత్వం వహించిన మర్యాద రామన్నకు కథను అందించినవారిలో కాంచి కూడా ఉన్నాడు. అంతేకాదు, రాజమౌళి చిత్రాలకు మరికొన్ని సందర్భాల్లో కూడా రచనా సహకారం అందించాడని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ.
తన దర్శకత్వ ప్రయాణంలో కాంచి షో టైం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. రణధీర్, రుస్కర్ థిల్లాన్ హీరో - హీరోయిన్లుగా నటించిన ఆ సినిమా అనుకున్న విధంగా విడుదల కాలేకపోయింది. అలా ఆయన దర్శకుడిగా కొనసాగకపోయినా, రచనపై ఉన్న పట్టు మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఇప్పుడు ఆ ప్రతిభే అతనిని ఒక భారీ ప్రాజెక్ట్‌కు తీసుకెళ్లింది. అదే వారణాసి. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి రూపొందిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాలో కాంచి రచయితగా పని చేశాడు. ఆశ్చర్యకరంగా, ఈసారి కథకుడిగా కేవలం విజయేంద్ర ప్రసాద్ పేరు మాత్రమే కాకుండా, ఆయన పక్కనే కాంచి పేరు కూడా టైటిల్ కార్డులో కనిపించింది. నిన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో ఈ విషయాన్ని అధికారికంగా చూపించారు. పురాణాలపై కాంచికి గల పట్టు, కథల నిర్మాణంలో ఆయనకు ఉన్న దూరదృష్టి ఇవన్నీ కలిసి వారణాసిని ఒక విశేష కథగా మలిచేలా చేశాయి. ఇప్పటివరకు తన ప్రతిభకు తగ్గ గౌరవం రానప్పటికీ, ఈ ఒకే చిత్రం కాంచి కెరీర్‌కు భారీ బ్రేక్ ఇస్తుందనే నమ్మకం పరిశ్రమలో బలంగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి