నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, తన బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ ‘అఖండ 2 – తాండవం’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ భారీ చిత్రం మరికొద్ది గంటల్లోనే థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. విడుదల సమయం దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ మరింత వేగంగా సాగుతున్నాయి. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్, అఖండ 1 చూపించిన స్టార్ పవర్ కారణంగా అఖండ 2 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.


ప్రమోషన్స్‌లో పాల్గొన్న దర్శకుడు బోయపాటి శ్రీను కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. నిజానికి బాలయ్య కెరీర్‌లో 100వ సినిమాగా తాను చేయాల్సిన ప్రాజెక్ట్ ఇదేనని ఆయన వెల్లడించారు. అప్పటికే కథ, కాన్సెప్ట్ అన్నీ దాదాపుగా రెడీ అయిపోయాయని చెప్పారు. కానీ ఆ సమయంలో తాను ‘సరైనోడు’ చిత్రానికి కమిట్‌ అవ్వడం వల్ల ఇద్దరి మధ్య ఆ మైలురాయి సినిమా జరగలేదని అ అన్నారు. ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నందుకు కొంచెం బాధగా కూడా అనిపించిందని బోయపాటి గుర్తుచేసుకున్నారు.



తర్వాత ఒక సందర్భంలో బాలయ్యగారిని కలిసినప్పుడు, “మీరు ఒక అఘోర అవతారంలో కనిపించేలా ఒక కాన్సెప్ట్ ఉంది. ఎంతో పవర్‌ఫుల్‌గా, వైబ్రేషన్‌తో, పూర్వం ఎప్పుడు చూడని విధంగా మీ పాత్రను డిజైన్ చేయాలనుకుంటున్నాను” అని చెప్పగానే, బాలయ్య ఎలాంటి సందేహం లేకుండా వెంటనే ‘ఓకే బాబు… చేద్దాం!’ అని అంగీకరించారని అన్నారు. అలా మొదలైంది అఖండ 1 ప్రయాణం… ఆ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందనను అందుకోవడం, దేశవ్యాప్తంగా బాలయ్యకు అపారమైన క్రేజ్ పెరగడం అన్నీ కలిపి ఒక సంచలనాన్ని సృష్టించాయి.అయితే ఒకవేళ బోయపాటి శ్రీను అప్పట్లో సరైనోడుకు లాక్ కాకపోతే, లేదా కొన్ని పరిస్థితులు కాస్త ముందుగానే సెట్ అయి ఉంటే, ఈ క్రేజీ, పవర్‌ఫుల్ ప్రాజెక్ట్ అప్పుడు బాలయ్య కెరీర్ 100వ సినిమాగా బరిలోకి దిగిపోయేదని చెప్పాలి. ఈ విషయాన్ని బోయపాటి స్వయంగా చెప్పడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.



ఇప్పుడు అఖండ 2 రూపంలో అదే జంట మరొక్కసారి స్క్రీన్‌పై సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. అఘోర శక్తి, తాండవ రౌద్రం, బోయపాటి మాస్ కామర్షియల్ మేకింగ్‌—ఇవి అన్నీ కలవడంతో ఈ సినిమా బాలయ్య ఫిల్మోగ్రఫీలో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో విడుదల అవుతున్న ఈ భారీ చిత్రానికి ప్రేక్షకులు ఏ విధమైన జైకొట్టబోతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: