ఒకప్పుడు హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే సింగిల్ థియేటర్ల గోల గోల. సంధ్య, సుదర్శన్, ఓడియన్, సప్తగిరి, శ్రీ మయూరి… ఏ సినిమా రిలీజ్ అయినా ఇక్కడే నిజమైన థియేటర్ ఫీల్ క‌నిపించేది. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు వేలాది మంది అభిమానులు క్యూలో నిలబడటం సాధారణమే. కానీ కాలం మారింది, సినీ కల్చర్ కూడా మారిపోయింది. సింగిల్ స్క్రీన్ల హంగామా క్రమంగా తగ్గిపోతుండగా, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల కొత్త అడ్డాగా రూపుదిద్దుకుంటోంది.

సుదర్శన్ 70 ఎం.ఎం, ఓడియన్ 70 ఎం.ఎం వంటి ఐకానిక్ థియేటర్లు మూతపడటం చూసి అభిమానులు బాధపడ్డా… ఆ స్థలాల్లో ఇప్పుడు మరింత పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ వరల్డ్ రెడీ అవుతోంది. సుదర్శన్ స్థలంలో నిర్మించిన భారీ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఏఎంబీ క్లాసిక్ గ్రాండ్‌గా తెరలేపేందుకు సిద్ధమైంది. గచ్చిబౌలిలో మహేశ్ బాబు - సునీల్ నారంగ్ కలిసి ఏర్పాటు చేసిన ఏఎంబీ సూపర్ హిట్ కావడంతో, అదే జోష్‌తో ఈ సెకండ్ వెంచర్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో స్టార్ట్ చేస్తున్నారు. ఏకంగా 7 స్క్రీన్లు ఉండే ఈ మల్టీప్లెక్స్‌ను పొంగల్‌కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు సమాచారం.

ఇక ఓడియన్ థియేటర్ల ఉన్న చోట కొత్తగా నిర్మించిన ఓడియన్ మాల్ కూడా ఓపెనింగ్‌కు సిద్ధంగానే ఉంది. ఇక్కడ 8 స్క్రీన్లతో భారీ మల్టీప్లెక్స్ రెడీ చేశారు. మొద‌ట అక్టోబర్‌ 24కే లాంచ్ చేయాలని అనుకున్నా… చివరికి ముహూర్తం పొంగల్‌పై పడింది. అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీ 7 స్క్రీన్లు మ‌రియు ఓడియ‌న్‌ 8 స్క్రీన్లు మొత్తం 15 కొత్త స్క్రీన్లు ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయన్నమాట.

కాగా, సింగిల్ థియేటర్ యుగం ముగిసిపోయినా… ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆకర్షణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా ఇప్పుడు మల్టీప్లెక్స్‌ల రాకతో మరింత క్రేజీగా మారబోతోంది. వచ్చే పండగ నుంచి ఈ ప్రాంతంలో సినిమా వాతావరణం మళ్లీ పీక్‌కి చేరడం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: