టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్న స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన గత కొన్నినాళ్లుగా తన పెళ్లి సంబంధిత వార్తలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమవుతోంది. నవంబర్ 21న ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తో ఆమె ఎంగేజ్‌మెంట్ జరిగింది.  అనంతరం నవంబర్ 23న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు కూడా బలమైన కథనాలు వచ్చాయి. అయితే కొన్ని వ్యక్తిగత పరిస్థితుల కారణంగా ఆ వివాహం వాయిదా పడినట్టు అప్పటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలో, న్యూఇయర్ తర్వాత ఈ జంట పెళ్లి చేసుకునే అవకాశముందని కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా స్మృతి మంధాన చేతిలో ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించకపోవడం.. అభిమానుల్లో అనేక ప్రశ్నలకు దారితీసింది. ఈ రూమర్స్ అంతటిలో చివరకు స్మృతి మంధాన స్వయంగా స్పందించడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అధికారికంగా స్పందిస్తూ, “నా పెళ్లి రద్దయింది” అంటూ స్పష్టమైన ప్రకటన చేసింది. గత కొన్ని వారాలుగా తన పేరు చుట్టూ తిరుగుతున్న రూమర్లకు స్వయంగా ముగింపు పలిచింది. “కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ వివాహం రద్దయ్యింది. రూమర్లు ఎలాంటి రూపంలోనైనా కొనసాగకుండా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం మంచిదని భావించాను” అని ఆమె పేర్కొన్నారు.



అలాగే…“నేను వ్యక్తిగత విషయాలను మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకునే వ్యక్తిని. కానీ ఈ సందర్భంలో నిశ్శబ్దంగా ఉండటం సరైనది కాదని అనిపించింది. అందువల్ల ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది. ఇరుకుటుంబాల గోప్యతను గౌరవిస్తూ.. ఇక ముందుకు సాగేందుకు అందరూ అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను” అని మంధాన చెప్పుకువచ్చింది.  ఇంకా ఆమె దేశ సేవ పట్ల ఉన్న నిబద్ధతను మరోసారి స్పష్టం చేస్తూ…“నా పూర్తి దృష్టి క్రికెట్‌పైనే ఉంది. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, అత్యున్నత స్థాయిలో ఇంకా ఎన్నో మ్యాచ్‌లు ఆడాలని, భారత జట్టుకు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నాపై నమ్మకం ఉంచి ఎప్పటికప్పుడు మద్దతుగా నిలిచే అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని పేర్కొంది.



స్మృతి మంధాన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో నడుస్తున్న వార్తలకు ఆమె స్వయంగా తెరదించడంతో, ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఆమె రాబోయే మ్యాచ్‌లపై కళ్లేసిన పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో పూర్తిగా క్రికెట్‌పైనే దృష్టి పెట్టనున్నట్లు స్పష్టంగా చెప్పిన మంధాన ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు కారణమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: