బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఈFFఈ) సందర్భంగా ఆయన ‘కాంతార: చాప్టర్ 1’ సినిమాపై మాట్లాడుతూ, పంజుర్లీ దేవతకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అనుకరించిన తీరు పెద్ద దుమారం రేపింది. ఆ ఇమిటేషన్ దేవతలను అపహాస్యం చేసినట్టుగా ఉందంటూ పలువురు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. నెటిజన్లు రణ్‌వీర్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ స్పందిస్తూ, తన ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని వివరణ ఇచ్చారు. అయితే అదే ఈవెంట్‌లో హాజరైన ‘కాంతార’ దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి మాత్రం అప్పట్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మౌనంగా ఉన్నారు. రణ్‌వీర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తక్షణమే స్పందించకపోవడం అప్పట్లో గమనార్హంగా మారింది.


ఇన్ని రోజుల తరువాత ఈ అంశంపై రిషబ్ శెట్టి తొలిసారి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన చాలా సంయమనంతో, కానీ స్పష్టమైన మాటలతో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “కాంతార లాంటి సినిమా తీసేటప్పుడు సంస్కృతి, సంప్రదాయాలు పాప్ కల్చర్‌గా మారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఒక దర్శకుడిగా, నిర్మాతగా నేను ప్రతిదీ అత్యంత గౌరవప్రదంగా చిత్రీకరించాలనుకున్నాను. ఈ విషయాల్లో తప్పులు జరగకుండా ఉండేందుకు ఎంతోమంది పెద్దల మార్గదర్శకత్వాన్ని కూడా తీసుకున్నాను” అని తెలిపారు.



అలాగే దేవతలపై మిమిక్రీ చేయడంపై తన అసౌకర్యాన్ని కూడా ఆయన స్పష్టంగా వ్యక్తం చేశారు. “దేవతలను అనుకరించడం నాకు కూడా అసౌకర్యాన్ని కలిగించింది. సినిమాలో చాలా అంశాలు సినిమాటిక్‌గా, నటనకు సంబంధించినవిగా ఉంటాయి. అయినప్పటికీ దైవం అనేది చాలా సున్నితమైన విషయం. అది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా, ఎలాంటి వేదికలపై అయినా దేవతలను అపహాస్యం చేయకూడదని నేను కోరుకుంటున్నాను” అని రిషబ్ శెట్టి అన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా రణ్‌వీర్ సింగ్‌ను ఉద్దేశించి చేసినవేనని సినీ వర్గాలు, అభిమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు, దేవతలను కించపరుస్తూ ట్రోల్స్, మీమ్స్ చేస్తున్న వారికి కూడా ఇది ఒక గట్టి హెచ్చరికలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నేరుగా ఎవరి పేరూ ప్రస్తావించకపోయినా, తన మాటలతో సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో రిషబ్ శెట్టి మరోసారి గుర్తు చేశారు.



మొత్తానికి, ఈ వివాదంలో రిషబ్ శెట్టి ఇచ్చిన స్పందన సంయమనం, స్పష్టత, గౌరవభావం కలగలిపినదిగా నిలిచింది. అదే కారణంగా ఇది ‘ట్రోల్ చేసే వాళ్లకి చెప్పుతో కొట్టే ఆన్సర్’ అంటూ అభిమానులు కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: