"మీరు అందరూ అనుకున్నట్లుగా వేణు స్వామీ అలాంటి వ్యక్తి కాదు" అంటూ యాంకర్‌, నటి విష్ణు ప్రియ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ టెలివిజన్ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ, తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, అలాగే ఆ సమయంలో తనకు అండగా నిలిచిన వేణు స్వామీ గురించి హృదయాన్ని తాకే మాటలు చెప్పింది.విష్ణు ప్రియ యాంకర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ గేమ్ షో ఆమెకు విపరీతమైన పాపులారిటీ తీసుకువచ్చింది. యాంకర్‌గానే కాకుండా నటిగా కూడా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాదు, ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో పాల్గొని మరింత ఫేమ్‌ను సంపాదించుకుంది.


అయితే, ఇటీవల ఓ షోలో పాల్గొన్న విష్ణు ప్రియ తన వ్యక్తిగత జీవితంలో జరిగిన కొన్ని బాధాకర సంఘటనలను ప్రేక్షకులతో పంచుకుంది. ముఖ్యంగా తన  మార్ఫింగ్ వీడియోల కారణంగా ఎన్నో అవమానాలు, మానసిక వేదన ఎదుర్కొన్నానని భావోద్వేగంగా తెలిపింది. ఆ విమర్శలు, ట్రోలింగ్‌ను తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా తనకు వచ్చిందని చెప్పింది. ఆ మాటలు ప్రేక్షకులను తీవ్రంగా కలిచివేశాయి. అలాంటి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వ్యక్తి వేణు స్వామీ అని విష్ణు ప్రియ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా ఆయనపై ఎన్నో విమర్శలు వస్తున్నప్పటికీ, తన జీవితంలో ఆయన చేసిన సాయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని స్పష్టంగా చెప్పింది. ముఖ్యంగా తన తల్లి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో, లక్షల్లో బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో తెలియక అయోమయంలో పడిపోయానని తెలిపింది.



ఆ సమయంలో తాను వేణు స్వామీకి ఫోన్ చేయగా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయన తనకు సాయం అందించారని చెప్పింది. డాక్టర్లు మూడు రోజులు మాత్రమే బతుకుతుందని చెప్పిన తన తల్లి, వేణు స్వామీ సహకారంతో సరైన చికిత్స పొందడంతో మరో ఏడాది పాటు జీవించిందని చెప్పి విష్ణు ప్రియ కన్నీళ్లు పెట్టుకుంది. నిజంగా ఆయన అంత సహాయం చేస్తారని అప్పటివరకు తాను ఊహించలేదని పేర్కొంది.ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు ముందుగా వచ్చి సహాయం చేసే మంచి మనిషి వేణు స్వామీ అని విష్ణు ప్రియ ప్రశంసల వర్షం కురిపించింది. తన జీవితంలో ఆయన చేసిన మేలు ఎప్పటికీ మరచిపోలేనిదని మరోసారి చెప్పింది.



ప్రస్తుతం విష్ణు ప్రియ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతూ, వేణు స్వామీపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు విష్ణు ప్రియ నిజాయితీని మెచ్చుకుంటే, మరికొందరు ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: