ఇండస్ట్రీలో ‘నేచురల్ బ్యూటీ’గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె తొలిసారిగా హిందీ సినిమాలో నటించనున్న నేపథ్యంలో సినీ వర్గాలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ హిందీ చిత్రం ద్వారా సాయి పల్లవి బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నది ప్రముఖ నటుడు ఆమిర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హీట్ పెరిగింది. ఐస్‌క్రీమ్ చేతిలో పట్టుకుని కనిపించిన సాయి పల్లవి, జునైద్ ఖాన్‌ల జంట లుక్ చాలా మందిని ఆకట్టుకుంది. సహజమైన అభినయం, మేకప్ లేని లుక్‌తో సాయి పల్లవి మరోసారి ప్రేక్షకుల మనసు గెలుచుకుందన్న ప్రశంసలు కూడా వెల్లువెత్తాయి.అయితే, ఈ ప్రశంసలతో పాటు వివాదం కూడా తెరపైకి వచ్చింది. 2016లో విడుదలైన థాయ్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘వన్ డే’ పోస్టర్‌కు ‘ఏక్ దిన్’ ఫస్ట్ లుక్ చాలా దగ్గరగా ఉందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. టైటిల్ నుంచి పోస్టర్ డిజైన్ వరకూ అన్నీ ఒకేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. కొందరు ఇది అధికారిక రీమేక్ కాదా? లేక కాపీ కాన్సెప్ట్‌తో తెరకెక్కించారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఇంతేకాకుండా, గతంలో ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన ‘లాల్ సింగ్ చద్దా’, ‘లవ్ యప్పా’, ‘సితారే జమీన్ పర్’ వంటి సినిమాల బాక్సాఫీస్ ఫలితాలను ప్రస్తావిస్తూ, ‘ఏక్ దిన్’ కూడా అదే బాటలో నడిచే అవకాశముందంటూ కొంతమంది నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఇలాంటి నెగటివ్ ప్రచారం జరగడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.ప్రస్తుతం ఈ ట్రోలింగ్ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం ప్రారంభమయ్యేలోపే అనుకోని అడ్డంకులు ఎదురవుతున్నాయనే చర్చ బలంగా వినిపిస్తోంది. అయితే, మరోవైపు సాయి పల్లవి నటన, కథలోని భావోద్వేగాలు సినిమాకు ప్లస్ అవుతాయని, వివాదాలు క్రమంగా సర్దుమనిగి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసే వారు కూడా లేకపోలేదు.

చివరికి ఈ వివాదం సినిమా విజయాన్ని ప్రభావితం చేస్తుందా? లేక అదృష్టం కలిసి వచ్చి ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలుస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే. ఏదేమైనా, సాయి పల్లవి బాలీవుడ్‌లో వేసిన ఈ తొలి అడుగు ఆమె కెరీర్‌లో కీలక మలుపుగా మారనుందనే అభిప్రాయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: