కాంగ్రెస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ నేత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మ‌ధ్య  తాజాగా విమ‌ర్శ‌లు- ప్ర‌తివిమ‌ర్శ‌లు సాగాయి. ప్రధాని మోడీ,  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్  సృష్టించిన ఎకనమిక్ డిజాస్టర్‌ను.. ఎలా అధిగమించాలో వాళ్లకే తెలియడం లేదన్నారు. ఆర్థికమాంద్యాన్ని ఎలా పరిష్కరించాలన్న దానిపై.. కేంద్రం దగ్గర ఎలాంటి ఆలోచన లేదన్నారు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవడం ఎంతమాత్రం వర్కవుట్ కాదన్నారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకోవడమంటే బుల్లెట్ గాయానికి  బ్యాండ్ ఎయిడ్ వేయడం లాంటిదేనని రాహుల్ వ్యాఖ్యానించారు.


కాగా, కేంద్రప్రభుత్వంపై రాహుల్‌ చేసిన విమర్శకు బదులిచ్చారు.  “రాహుల్ గాంధీ గతంలో బీజేపీ ప్రభుత్వాన్ని చోర్ చోర్ అంటూ పదే పదే విమర్శించేవారు. జనం ఆయనకు, వారి పార్టీకి బుద్ధి చెప్పింది. ఐనా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. ఇలాంటి అంశాలపై మాట్లాడేముందు.. వారి పార్టీకి చెందినవారు ఎవరైనా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఉంటే వారి దగ్గర సమాచారం తీసుకోవాల్సింది. దొంగిలించడం అనే సబ్జెక్ట్ లో రాహుల్ ఎక్స్ పర్ట్. అందుకే.. రాహుల్ చేసిన విమర్శపై ఇంతకంటే ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు.” అని నిర్మల అన్నారు.


ఇదిలాఉండ‌గా,  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి కేంద్ర ప్రభుత్వ ఖజానాకు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో రూ.1.76 లక్షల కోట్ల మిగులు నగదు నిల్వలు వస్తున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన 578వ సెంట్రల్ బోర్డు సమావేశంలో బిమల్‌జలాన్ కమిటీ సిఫారసులు ఆమోదం పొందాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ జలాన్ నేతృత్వంలో సెంట్రల్ బ్యాంక్ నగదు నిల్వలపై ఏర్పాటైన కమిటీ సూచనల మేరకు రూ.1,76,051 కోట్లను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) రూ.1,23,414 కోట్లను ఇవ్వనున్న ఆర్బీఐ.. మరో రూ.52,637 కోట్లనూ ముట్టజెప్పనున్నది. సవరించిన ఆర్థిక మూలధన నియమావళి (ఈసీఎఫ్) ప్రకారం గుర్తించిన ఈ రూ.52,637 కోట్ల మిగులు నిల్వలను 2018-19కిగాను ఖజానాకు తరలిస్తున్నట్లు ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: