బాలకృష్ణ అంటేనే ఆవేశానికి మారు పేరు అన్న మాట వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఆయన ఆవేశం వెనుక కూడా ఒక లాజిక్ ఉందని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఏ పరిణామాలు జరిగినా, దాని పర్యవసానాలు ఏమవుతాయన్నది పట్టించుకోకుండా తాను నమ్మినదే మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది. అలాంటిదే ఈసారి అసెంబ్లీలో చోటుచేసుకుంది. బాలయ్య అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, రియాక్షన్ మాత్రమే ఇచ్చానని చెబుతున్నాడు. తన మాటల్లో కొత్తేమీ లేదని, గతంలో చాలా మంది చెప్పినదే తాను పునరావృతం చేశానని అంటున్నారు. బాలయ్య వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వెంటనే విదేశాల నుంచే ఓ లేఖ విడుదల చేసి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో కూటమి పెద్దలు పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. బాలయ్య వ్యాఖ్యలు డ్యామేజ్ చేశాయని భావించిన నాయకత్వం ఆయన సభలోకే వచ్చి స్వయంగా వెనక్కి తీసుకోవాలని కూడా సూచించింది.

కానీ బాలయ్య మాత్రం తాను తప్పే మాట్లాడలేదని, అందరూ చెప్పిందే అన్నానని పట్టుబట్టారని అంటున్నారు. ఆ తర్వాత కామినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో కలిపి బాలయ్య వ్యాఖ్యలను కూడా రికార్డు నుంచి తొలగించారు. ఇక అసలు ఆగ్రహం కారణం ఎఫ్డీసీ (ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చైర్మన్ పదవి అని చెబుతున్నారు. బాలయ్య తన మనిషికి ఆ పదవి రావాలని డిమాండ్ పెట్టారని సమాచారం. బాలయ్య సాధారణంగా పార్టీ కోసం ఏ పదవీ కోరడని, కానీ ఒకసారి కోరితే మాత్రం దాన్ని సాధించకుండా వదులుకోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే పదవికి బలమైన సిఫార్సు పెట్టారట. పవన్ తన హరిహర వీరమల్లు సినిమాను నిర్మించిన ఏఎం రత్నం ఎఫ్డీసీ చైర్మన్ కావాలని కోరుతున్నారని అంటున్నారు.

ఇక ఈ డిమాండ్‌తో టీడీపీ హైకమాండ్ కొంత ఇబ్బందుల్లో పడింది. అటు బాలయ్య, ఇటు పవన్ – ఇద్దరి డిమాండ్‌లను తీరుస్తేనే సమస్య ముగుస్తుంది. లేకపోతే అసంతృప్తులు రగులుతాయనే భయం పార్టీకి ఉంది. చంద్రబాబు తాజాగా పవన్ కళ్యాణ్‌తో భేటీ కావడంతో ఎఫ్డీసీ పదవి చివరికి జనసేనే నిర్ణయించే అవకాశం ఎక్కువగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో తన ప్రాధాన్యం తగ్గిపోతోందని బాలయ్య అసంతృప్తిగా ఉన్నారని, అదే అసెంబ్లీలో ఆయన ఆగ్రహానికి ప్రధాన కారణం అయిందని అంటున్నారు. బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ వెనుక కేవలం ఆవేశం మాత్రమే కాకుండా, ఎఫ్డీసీ పదవిపై తన పట్టుదల కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పుడు ఆ పదవి ఆయన చెప్పిన వారికి రాకపోతే బాలయ్య ఎలా స్పందిస్తారు అన్నదే రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. మొత్తం మీద బాలయ్య ఆగ్రహం, పవన్ డిమాండ్, హైకమాండ్ నిర్ణయం – ఈ మూడూ కలసి టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: