
అలాగే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను త్వరలోనే పరామర్శిస్తానని విజయ్ హామీ ఇచ్చాడు. అభిమానుల ప్రాణాలు తనకు అత్యంత ప్రాధాన్యమని, ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా పార్టీ తరఫున ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పాడు. ఆయన ఈ మాటలు చెప్పిన వీడియో నెట్టింట షేర్ అవ్వడంతో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఇక మరోవైపు ఈ ఘటనను కొన్ని రాజకీయ పార్టీలు వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, వాస్తవాలు క్రమంగా బయటకు వస్తాయని విజయ్ స్పష్టం చేశాడు. అభిమానుల ప్రాణాలు కోల్పోయిన సమయంలో కూడా రాజకీయ లాభం కోసం ప్రయత్నించడం తగదని ఆయన పరోక్షంగా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడ్డారు.
విజయ్ ఈ స్పందనతో మరోసారి ఆయన అభిమానుల్లో సానుభూతి, నమ్మకం పెరిగింది. సినీ స్టార్ నుండి రాజకీయ నేతగా మారిన విజయ్ ప్రతి అడుగూ ప్రజల దృష్టిలో ఉండటం ప్రత్యేకం. కరూర్ ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించే సమయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు, ప్రకటనలు తమిళ రాజకీయాలకు కీలకమవుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ ఘటన తర్వాత తమిళగ వెట్రి కళగం పార్టీ భవిష్యత్ ఎలక్షన్ ర్యాలీల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. కరూర్ విషాదంపై విజయ్ స్పందన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల వరకు ఈ ఘటన విజయ్ రాజకీయ ప్రయాణంలో ఎంతటి మలుపు తీసుకువస్తుందో చూడాలి!