కరోనా నాశనమైపోతుందని ఎవరైనా చెబితే తాము నమ్మే ప్రసక్తి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. కరోనా ఎక్కడికీ పోదని, వ్యాక్సిన్ వచ్చినా దాన్ని నియంత్రించండం అంత తేలిక కాదని ప్రకటించింది. ప్రజలు కూడా కరోనాతో  కలిసి జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించింది. 

 

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న తరుణంలో.. ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని  సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో సాధ్యం కాదని చెప్పింది.

 

కరోనా లాంటి ఓ వైరస్ వ్యాప్తి చెందటం ఇదే తొలిసారి అని... మనిషి దానిపై ఎప్పుడు విజయం సాధించగలడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

 

200 పైగా దేశాల్లో వ్యాపించిన కొవిడ్‌-19 స్థానిక వైరస్‌గా మారగలదని.. ఇది శాశ్వతంగా కనుమరుగవటం అనేది జరగదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కరోనాను ఎయిడ్స్ తో పోల్చింది. హెచ్‌ఐవీని నిర్మూలించలేకపోయినప్పటికీ దానిని ఎలా కట్టడిచేయాలో తెలుసుకున్నామని, అదే విధంగా కరోనా విషయంలోనూ జరగాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ జనాభాలో సగానికి పైగా లాక్‌డౌన్‌లో ఉన్నారని... ప్రస్తుత సడలింపుల తరుణంలో.. కోవిడ్ మరోసారి రావచ్చని హెచ్చరించింది.

 

ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలను సరళీకృతం చేస్తున్నప్పటికీ... అప్రమత్తంగా ఉండటం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుందని చెప్పింది. లాకడౌన్‌తో కరోనాను పూర్తిగా కట్టడి చేయగలమని, ఎత్తేయడమే ఉత్తమమనే రెండు ఆలోచనలూ సరికాదంది. వ్యాక్సిన్ వస్తే.. కరోనా కట్టడిలో అతి పెద్ద ముందడుగు అవుతుందని అభిప్రాయపడింది. 

 

మొత్తానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయమే చెప్పింది. ఎవరికి వారు జాగ్రత్త పడితే తప్ప కరోనాను శాశ్వతంగా అంతం చేయలేమని ప్రకటించేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: