దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతోంది. ఈ వైరస్ గురించి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యులు తాజాగా కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో ఊపిరితిత్తుల సమస్యలు ఎదురవుతున్నట్లు తేల్చారు. చైనా వైద్యులు వుహాన్ ఆస్పత్రిలో కోలుకున్న వాళ్లలో 90 శాతం మందిలో ఈ సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.
 
వుహాన్ యూనివర్సిటీకి చెందిన జాంగ్ హన్ ఆస్పత్రి వైద్య నిపుణుల బృందం చేపట్టిన అధ్యయనంలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించగా 90 శాతం మందిలో ఊపిరితిత్తులు దెబ్బ తినే ఉన్నాయని... సాధారణ ఆరోగ్యవంతుల్లో పని చేసిన విధంగా వీళ్లలో ఊపిరితిత్తులు పని చేయడం లేదని చెప్పారు. వాయు ప్రసరణ, గ్యాస్ ఎక్స్ ఛేంజ్ విధులు సక్రమంగా జరగడం లేదని గుర్తించామని తెలిపారు.
 
కరోనా విజేతలను ఆరు నిమిషాల పాటు నడిపించగా వాళ్లు సగటున 400 మీటర్లు మాత్రమే నడవగలిగారని... ఆరోగ్య వంతులు అదే సమయంలో 500 మీటర్లు నడవగలరని చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో రోగ నిరోధక శక్తి మెరుగవ్వలేదని తెలిపారు. కోలుకున్న వాళ్లలో 10 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు కనుమరుగైపోయినట్లు తెలిపారు. ఇమ్యూనోగ్లోబులిన్ ఎం పరీక్షల్లో కొందరికి ఇప్పటికీ పాజిటివ్ చూపిస్తోందని తెలిపారు.      
 
కరోనాను జయించిన చాలామంది కుంగుబాటుకు గురవుతున్నారని... కోలుకున్న వాళ్లతో కలిసి భోజనం చేసేందుకు కుటుంబ సభ్యులు సైతం విముఖత చూపుతున్నారని వైద్యులు వెల్లడించారు. మరోవైపు భారత్ లో గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ పదివేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా రికవరీ రేటు పెరుగుతూ మరణాల రేటు తగ్గుతున్నా ప్రజల్లో భయాందోళన మాత్రం తగ్గడం లేదు. ఏపీలో గత కొన్ని రోజులుగా భారీగా కేసులు నమోదవుతున్నాయి.


 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: