ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కార్యక్రమం గురించి కాన్ఫరెన్స్  నిర్వహించిన జగన్ కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం కోసం ఎక్కువ ఫీజులు వసూలు చేయడంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారమే కరోనా రోగుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు ఫీజులు వసూలు చేయాలని పేర్కొన్నారు.
 
రోగుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కరోనా బాధితుల విషయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలని అన్నారు. కరోనా బాధితుడికి అరగంటలో బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని చెప్పారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వరదలు, సహాయక చర్యల గురించి జగన్ సమీక్ష నిర్వహించారు.
 
కృష్ణా, గోదావరి నదులలో వరదలు తగ్గుముఖం పడుతున్నాయని... వచ్చే నెల 7వ తేదీలోగా వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు నివేదిక రూపొందించాలని చెప్పారు. గోదావరి వరద ముంపు బాధిత కుటుంబాలకు 2 వేల రూపాయల పరిహారం అందించాలని అన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పామాయిల్‌, కేజీ ఉల్లి.. కేజీ బంగాళదుంపలు, 2 లీటర్ల కిరోసిన్‌ పేద్లకు ఇవ్వాలని చెప్పారు.
 
నిత్యావసర వస్తువులు , సరుకులు ప్రజలకు వచ్చే నెల 7వ తేదీలోగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరద ప్రాంతాలలో రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని అందువల్ల మందులను అందుబాటులో ఉంచుకోవడంతో పాటు ఇరిగేషన్ వసతులు దెబ్బ తిన్న చోట పనులు వెంటనే ప్రారంభించాలని చెప్పారు. మండల స్థాయిలో నిత్యావసరాలను పూర్తిస్థాయిలో నిల్వ చేసుకోవాలని పారిశుద్ధ్యం, తాగునీటి వసతుల క్లోరినేషన్ కొరకు చర్యలు చేపట్టాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: