విజయవాడ: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గురువారం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఎన్నికలపై స్టే విధిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కొనసాగాంచాలంటూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ఎన్నికలు రెండూ అంశాలు ముఖ్యమేనని కోర్టు తెలిపింది. ఎవరికీ ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలంటూ ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమన్వయంతో కలిసి ముందుకు సాగాలంటూ హైకోర్టు సూచనలు చేసింది. కాగా.. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎస్‌ఈసీ స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రకటించింది.

ఇంతకు ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ఎస్‌ఈసీ తెలిపింది. వచ్చే నెల 5, 9, 13, 17 తేదీలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్నట్టు ఎస్‌ఈసీ పేర్కొంది. కాగా.. ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు.

కరోనా కారణంగానే వాయిదా వేశామని ఆ సమయంలో నిమ్మగడ్డ చెప్పారు. ఇప్పుడు కరోనా మహమ్మారి ఉందని, ఇప్పుడెందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ ప్రభుత్వం నిమ్మగడ్డను ప్రశ్నించింది. అయినప్పటికి నిమ్మగడ్డ మాత్రం తన పదవీ కాలం ముగిసే లోపే ఎన్నికలను నిర్వహించాలని చూస్తున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం మార్చి నెలతో ముగియనుంది. ఆయన పదవీ కాలం ముగిసిన తరువాతే ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వచ్చిన కోర్టు తీర్పుతో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: