హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా హుజరాబాద్ నియోజకవర్గం లో గెలవాలని అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి. ఇక అధికార పార్టీ అయిన టిఆర్ఎస్… ప్రతిపక్షాల కంటే ముందే తమ అభ్యర్థిని ప్రకటించేసింది. ఉద్యమ నాయకుడైన గెల్లు శ్రీనివాస్ బరిలోకి దింపింది గులాబీ పార్టీ. ఇక అటు.. భారతీయ జనతా పార్టీ తరఫున ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి ఈటల జమున ను బరిలో దింపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. 

ఇక కాంగ్రెస్ పార్టీ… ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించలేదు. మొన్నటివరకు కౌశిక్ రెడ్డి అభ్యర్థి అనుకున్నా… ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలు పెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లు మరియు జూనియర్ల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హుజరాబాద్ అభ్యర్థిగా రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిసాన్ సెల్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి హుజురాబాద్ అభ్యర్థి అయితే…. కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయని సీనియర్లు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇక ఈ పత్తి కృష్ణారెడ్డి… హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు కావడం కలిసొచ్చే అంశం. అటు రెడ్డి సామాజిక ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకే పడతాయన్న నేపథ్యంలో… పత్తి కృష్ణా రెడ్డి పేరును ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇవాళ రేవంత్ రెడ్డి… సమీక్ష నిర్వహించి ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మొన్నటి వరకు హుజురాబాద్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ బరిలో ఉంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: