ఆదిలాబాద్ ఏజెన్సీలో గిరిజనుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. అస్తవ్యస్థమైన రహదారులతో అడవి బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు. వాగు ఉప్పొంగడంతో వైద్యం సకాలంలో అందక పురిటి నొప్పులతోనే నిండు గర్భిణీ కన్ను మూసింది. సరైన సమయానికి ఆసుపత్రికి చేరుకోలేక ప్రసవ వేదనతో తల్లితో పాటు కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది. గాదిగూడ మండలం కోలాంగూడకు చెందిన రాజుబాయి అనే గిరిజన మహిళ పురిటి నొప్పులతో మార్గమధ్యంలోనే చనిపోవడం కలకలం రేపుతోంది. మరో ఘటనలో నిండు గర్భిణీ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుంది.

కోలాంగూడకు చెందిన రాజుబాయి అనే మహిళ నిండు గర్భిణీ. పురిటినొప్పులు రావడంతో కుటుంబసభ్యులు 108కు కాల్‌ చేశారు. మధ్యలో వాగు ఉప్పొంగడంతో అంబులెన్స్‌ గ్రామానికి చేరుకోలేదు. దీంతో, రాజుబాయిని మోసుకుంటూ కుటుంబ సభ్యులు వాగు వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రవాహం అధికంగా ఉంది. రాజుబాయి నొప్పులతో విలవిల్లాడుతుండటంతో ధైర్యం చేసి ఆమెను భుజంపై వేసుకుని వాగు దాటారు. వాగు ఒడ్డున  ఉన్న అంబులెన్స్‌లోకి చేర్చి గాదిగూడ పిహెచ్ సీకి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేరు. దీంతో సమీపంలో ఉన్న ఝరి పిహెచ్‌సీకి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించారు. ఆదిలాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే రాజుబాయి చనిపోయింది. దీంతో,  గూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. వాగుపై వంతెనతో పాటు సరైన రహదారి లేకపోవడంతో అంబులెన్స్ ఉన్నా నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.

ఇక ఇదే జిల్లాలోని మరో  గర్భిణీకి పురిటినొప్పులు వస్తే ఎడ్లబండే దిక్కుగా మారింది. నేరడిగొండ మండలం రాజులతండాకు చెందిన సరిత అనే నిండు  గర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు గ్రామస్థుల అవస్థలు వర్ణనాతీతంగామారాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న దారిపై ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇంతలోనే.. గ్రామ సమీపంలోని వాగు ఉప్పొంగింది. వాగు ప్రవాహం అధికంగా ఉండటంతో రెండు గంటల పాటు అక్కడే వేచి చూశారు. అయినా తగ్గలేదు. మరోవైపు.. ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. చివరకు కుటుంబ సభ్యులు ధైర్యం చేశారు. మరో మార్గం లేకపోవడంతో ఎడ్లబండిపై సరితను వాగు దాటించారు.  అక్కడి నుంచి వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. సరైన వైద్యం అందించకపోతే వైద్యుడిది తప్పు.. మరి గ్రామాలకు సరైన రహదారి, వైద్య సదుపాయలు కల్పించకపోతే ఎవరిది బాధ్యత. ఏజెన్సీ పరిధిలో మాతా, శిశు మరణాలు ఎక్కువగా సంభవించడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: