ఉద్య‌మం ఎలా ఉన్నా కీల‌క నేత‌ల మ‌ర‌ణం మాత్రం తీర‌ని శోకం మిగిల్చి  పోతోంద‌ని ఆర్కే సానుభూతి ప‌రులు క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు. సైద్ధాంతిక విభేదాలు ఎలా ఉన్నా తమతో న‌డుచుకునే తీరు ఎలా ఉన్నా అయిన వారి మ‌ర‌ణం త‌మ‌ను క‌లిచి వేస్తుంద‌ని వేద‌న చెందుతున్నారు. పండుగ వేళ ఇలాంటి వార్త ఒక‌టి వినాల్సివస్తుందా అన్న సంశ‌యంతో ఉన్నారు క‌ల్యాణ రావు అనే విప్ల‌వ రచ‌యిత తో స‌హా ఇంకొంద‌రు..


సుదీర్ఘ కాలం మావోయిస్టుల ఉద్య‌మానికి ఉనికిని, ఉద్ధృతిని ప్ర‌సాదించిన అగ్ర‌నేత అక్కిరాజు హ‌ర గోపాల్ అలియాస్ రామ‌కృష్ణ అలియాస్ ఆర్కే. ఇటీవ‌ల ఆయ‌న మ‌ర‌ణించార‌న్న వార్త ఒక‌టి వ‌స్తుంది. కానీ ఇందుకు త‌గ్గ అధికారిక ధ్రువీక‌ర‌ణ లేదు అని ఆయ‌న భార్య శిరీష అంటున్నారు. ఛ‌త్తీస్ గ‌ఢ్ అడ‌వుల్లో ఆయ‌న అనారోగ్యంతో మ‌ర‌ణించార‌ని, బీజాపూర్ లో ఉంటూ వైద్యం పొందినా ఫ‌లితం లేక‌పోయింద‌ని ఇంకొంద‌రు అంటున్నారు. ఇవ‌న్నీ ఎలా ఉన్నా సుదీర్ఘ కాలం పాటు ఉద్య‌మంతో అనుబంధం ఉన్న నేత మృత‌దేహాన్ని తాము చూడ‌కుండానే అంత్య క్రియ‌లు కూడా పూర్తి చేశార‌న్న వార్త ఒక‌టి త‌న‌ను క‌లిచివేస్తుంద‌ని శిరీష క‌న్నీటిప‌ర్యంతం అవుతున్నారు. కీల‌క నేత మ‌ర‌ణంతో ఆంధ్రా ఒడిశా స‌రిహ‌ద్దు ఉద్రిక్తంగా మారింది. ఏ క్ష‌ణాన అయినా మావోయిస్టులు తిరిగి త‌మ ప్రాబ‌ల్యం చాటేందుకు ప్ర‌య‌త్నించేందుకు అవ‌కాశాలున్నాయ‌ని పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దుల‌ను క్షుణ్ణంగా త‌నిఖీ చేస్తున్నారు.



కాగా ఆర్కే త‌ల‌పై కోటిన్న‌ర‌కు పైగా వెల ఉంది. వివిధ రాష్ట్రాల‌లో ఆయ‌నపై ప‌లు కేసులు న‌మోదు అయి ఉన్నాయి. వైఎస్ హ‌యాంలో చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ వాటి ప్ర‌భావం పెద్ద‌గా లేకుండా పోయింది. గత కొంత కాలంగా ఏఓబీ స్త‌బ్దుగానే ఉంది. కానీ మ‌న్యంలో బాక్సైట్ త‌వ్వ‌కాల‌ను మాత్రం తీవ్రంగానే ప్ర‌తిఘ‌టిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం హ‌యాంలో పాడేరు ఎమ్మెల్యే కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావును, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ‌ను హ‌త్య చేసిన మావోయిస్టులు అప్ప‌టి నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 2018, అక్టోబ‌ర్ నెల‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న త‌రువాత మావోలు పెద్ద‌గా ప్ర‌తిఘ‌ట‌న చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది లేదు. పైగా క‌రోనా కార‌ణంగా ప‌లువురు అగ్ర నేత‌లు తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యార‌న్న‌ది స‌మాచారం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: