ఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వేడి ఇంకా చల్లారలేదు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ అంశం చుట్టూనే రాజకీయమంతా నడుస్తోంది. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నేతల జనాగ్రహ దీక్షలు.. తమ పార్టీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష, ఇలా వరుసగా పోటాపోటీగా కార్యక్రమాలతో రాష్ట్రం వేడెక్కింది. సాధారణంగా రాజకీయాల్లో ఏదైనా విషయం జరిగినపుడు, ఒక పది రోజులపాటు ఆ విషయంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఆ విషయం జనానికి కూడా బోర్ కొడుతోంది. రాజకీయ పార్టీల నేతలు కూడా ఆ సబ్జెక్టు వదిలేసి.. కొత్తసబ్జెక్టుతో ప్రజల్లోకి వెళ్తుంటారు. ప్రత్యర్థులపై విమర్శలు చేస్తుంటారు.

అయితే తాజాగా పట్టాభి విషయంలో మాత్రం రెండు పార్టీలు తగ్గేలా కనిపించడం లేదు. పట్టాభి వ్యాఖ్యల కారణంగా టీడీపీ కార్యాలయాలపై దాడులు జరగడంతో చంద్రబాబు ఈ విషయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్నీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి కూడా చెప్పి వచ్చారు. అయితే అక్కడ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కూడా కలవాలని చంద్రబాబు భావించారు. అపాయింట్మెంట్ దొరకకపోవడంతో తిరిగి వచ్చేశారు. చంద్రబాబు తిరిగి ఏపీకి వచ్చారో లేదో.. అప్పుడే అమిత్ షా, బాబుకు ఫోన్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా కలవలేదని చెప్పి.. ఏపీలో జరిగిన పరిణామాలను తెలుసుకున్నారట.. దీంతో చంద్రబాబు ఇక్కడ విషయాలన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని చెబుతున్నారు.  

అమిత్ షా, చంద్రబాబుకు ఫోన్ చేసిన విషయంపై ఇప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా.. ఫోన్ ఎలా చేశారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ గొడవంతా పట్టాభి నుంచి ప్రారంభమై.. ఇలా అమిత్ షా వరకూ వచ్చి ఆగిపోయింది. ఇప్పుడంతా అమిత్ షా అసలు చంద్రబాబుకి ఫోన్ చేశారా, ఆయన అపాయింట్ మెంట్ ఎందుకివ్వలేదు అని వైసీపీ.. గతంలో మీక్కూడా అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదుగా అని టీడీపీ.. ఇలా అమిత్ షా చుట్టూ విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణమైన అసలు సబ్జెక్ట్ మాత్రం మాల్దీవ్స్ సేద తీరుతోంది. ఇప్పుడు రాజకీయమంతా అమిత్ షా, అమిత్ షా ఫోన్ కాల్ చుట్టూ తిరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: