రాష్ట్ర విభజనతో ఐటీ రంగానికి దేశంలోనే ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న హైదరాబాద్ తెలంగాణ పరం కావ‌డంతో ఏపీ యువ‌త‌కు హైద‌రాబాద్‌, చెన్నై, బెంగుళూర్‌, పూణే తదిత‌ర న‌గ‌రాల‌కు వ‌ల‌స వెళ్ల‌డం త‌ప్ప‌నిసరిగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ది ఆశాజ‌న‌కంగా ఉంది. నిపుణులైన యువ‌త‌కు అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పించే సామర్థ్యం ఈ రంగానికి  సొంతం. వ‌స్తూత్ప‌త్తి రంగంలా భారీ పెట్టుబ‌డులు కూడా అవ‌స‌రం లేని ప‌రిశ్ర‌మ ఇది. కేవ‌లం మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ప్రోత్సాహ‌కాలు ఇస్తే చాలు. ప‌లు కంపెనీలు త‌ర‌లివ‌చ్చి భారీ సంఖ్య‌లో యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించే అవ‌కాశ‌ముంది. విదేశీ మారక ద్రవ్యంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వానికి  పలు రకాలుగా ఆదాయం సమకూర్చగల ఐటీ ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఏపీలో ప్ర‌భుత్వం వైపునుంచి పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డం లేదనే చెప్పాలి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ఈ దిశ‌గా కొంత ప్ర‌య‌త్నం జ‌రిగిన విష‌యం వాస్త‌వం. మ‌రి ఈ ప్ర‌భుత్వం ఆ దిశ‌గా ఎందుకు కృషి చేయ‌డంలేద‌నే వాద‌న‌లు యువ‌త నుంచి బ‌లంగా వినిపిస్తున్నాయి.
 
         అంత‌కంత‌కూ దిగ‌జారుతున్న‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, యువతలో పెరుగుతున్న నిరుద్యోగం మునుముందు ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి పెను సవాలుగా మార‌నున్నాయ‌నే అభిప్రాయాలు నిపుణుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలో మౌలిక వసతుల క‌ల్ప‌న‌కు అత్యధిక నిధులు ఖర్చు చేయడంతో అది పలు దేశ, విదేశీ వ్యాపార సంస్థలకు పెట్టుబడుల గమ్య స్థానంగా
మారింది. ఆ న‌గ‌రంలో ప‌లు సంస్థ‌లు నెల‌కొల్ప‌డంతో స‌మాంత‌రంగా రియ‌ల్ ఎస్టేట్ ధ‌ర‌లు పెర‌గ‌డం తద్వారా అక్క‌డి ప్ర‌భుత్వానికి విశేషంగా ఆదాయం స‌మ‌కూరింది కూడా. అదే స‌మ‌యంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో వసతుల కల్పన అరకొరగానే ఉండటంతో అగ్రశ్రేణి  ఐటీ సంస్థలేవీ ఇత‌ర న‌గ‌రాల వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితినే ప్రతిఫలిస్తూ ఇప్ప‌టికీ రెండు తెలుగు రాష్ట్రాలు క‌లిపి చూసినా 95 శాతం ఐటీ ఎగుమతులు హైదరాబాద్ నుంచే జరుగుతూ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వ‌రంగ‌ల్‌ను కూడా భ‌విష్యత్తులో ఐటీ ప‌రిశ్ర‌మ‌ల హ‌బ్‌గా మార్చాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం కార్యాచ‌ర‌ణ కూడా మొద‌లుపెట్టింది. ఇక ఏపీలో ఇలా అభివృద్ధి చేసేందుకు అవ‌స‌ర‌మైన సానుకూల‌త‌ల‌న్నీ విశాఖ న‌గ‌రానికి ఉన్నాయి. కావాల్సింద‌ల్లా ఏపీ ప్ర‌భుత్వం త‌గిన చొర‌వ‌చూపడం మాత్ర‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: