బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ను పోలీసులు అరెస్టు చేశారు. కరీంగనర్‌లోని తన కార్యాలయంలో జాగరణ దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణలోని ఉద్యోగుల బదిలీలపై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను నిరసిస్తూ ఆయన జాగరణ దీక్షకు యత్నించారు. అయితే.. కొవిడ్‌ నిబంధనల వల్ల బండి సంజయ్‌ బహిరంగ దీక్షకు పోలీసులు అనుమతివ్వలేదు. అంతే కాదు.. దీక్షకు పోలీసుల అనుమతి లేనందున మీడియా కవర్ చేయొద్దని కరీంనగర్‌ సీపీ ఆదేశాలు జారీ చేశారు.


పోలీసులు అనుమతించక పోయినా దీక్షకు బండి సంజయ్ యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తన కార్యాలయానికి బయట నుంచి తాళం వేసుకుని మరీ జాగరణ దీక్షకు బండి సంజయ్ యత్నించారు. దీంతో పోలీసులు కార్యాలయం తాళాలు పగులకొట్టి మరీ బండి సంజయ్‌ను అరెస్టు చేశారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసి జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. బండి సంజయ్‌ను అరెస్టు చేసేందుకు బీజేపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టాల్సి వచ్చింది. దీంతో కరీంనగర్ బీజేపీ కార్యాలయం వద్ద కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటు చేసుకున్నాయి.


బండి సంజయ్‌ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు యత్నించిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు చాలాసేపు అడ్డుకున్నారు. భాజపా కార్యాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. బండి సంజయ్‌కు వలయంగా నిలబడి పోలీసులను అడ్డుకున్నారు. చివరకు పోలీసులు బండి సంజయ్‌ కార్యాలయ తాళాలు పగలగొట్టి మరీ ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చింది. జాగరణ దీక్షకు ఎవరూ అనుమతి కోరలేదని.. దీక్షకు అనుమతి కోసం దరఖాస్తు చేయలేదని కరీంనగర్  సీపీ సత్యనారాయణ తెలిపారు.

 
కొవిడ్‌ వల్ల జిల్లాలో ర్యాలీలు, భారీ బహిరంగ సభలకు అనుమతి లేదని తెలిపిన సీపీ.. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తున్నందువల్ల అంతా సహకరించాలన్నారు. బండి సంజయ్‌ తో పాటు దాదాపు 150 మంది వరకూ బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలు కూడా నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: