స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు సంబంధించి వైసీపీ చేసిందేమీ లేదు అన్న‌ది తేలిపోయాక ఇక ఆ సంస్థ‌ను కాపాడ‌డం అన్న‌ది ఓ అసాధ్య ప్ర‌క్రియ‌.న‌ష్టాల పేరుతో ప్లాంటును వ‌దిలించుకోవాల‌ని కేంద్రం యోచిస్తున్నా అదేమంత సులువు ప్ర‌క్రియ కాద‌ని కూడా తేలిపోయింది. అందుకే విడ‌త‌ల వారీగా లేదా ద‌శల వారీగా ప్లాంటును ప్ర‌యివేటీక‌ర‌ణ చేయాల‌న్న త‌లంపుతో కేంద్రం పావులు క‌దుపుతోంది.ఇదే స‌మ‌యంలో వైసీపీ త‌న‌దైన రాజ‌కీయం ఒక‌టి న‌డుపుతున్నా అదంతా స్వార్థ ప్ర‌యోజ‌నాల్లో భాగంగానే చేస్తుంద‌ని జ‌న‌సేన ఇప్ప‌టికే ఓ వంద సార్లు ఆరోపించింది. జ‌నాల‌ను ఆ దిశ‌గా ఆలోచించ‌మ‌ని కూడా విన్న‌వించింది. కానీ ఇప్ప‌టికిప్పుడు ప్లాంటు ప్ర‌యివేటీక‌ర‌ణ చేయ‌కున్నా వ‌చ్చే ఎన్నిక‌ల త‌రువాత అయినా ద‌శ‌ల వారీగా ప్లాంటును ఏ కీలుకు ఆ కీలు విడ‌గొట్టి మ‌రీ! అమ్మేందుకు త‌ద్వారా త‌మ నెత్తిన భారం దించుకునేందుకు కేంద్రం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. పైకి రాజ‌కీయ పార్టీలు కేంద్రం నిర్ణ‌యం వ్య‌తిరేకించినా లోలోప‌ల మాత్రం ఎవ‌రికి ఎంత లాభం అన్న విష‌య‌మై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నాయ‌న్న‌ది ఓ నిజం.సో.. స్టీల్ ప్లాంట్ రాజ‌కీయాల్లో భాగంగా హాయిగా ఎప్ప‌టిలానే క్విడ్ ప్రోకో న‌డుస్తోంది..ఇలాంటి అననుకూల వాతావ‌ర‌ణంలో టాటాలు ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే క‌రోనా వేళల్లో కూడా స‌మ‌ర్థంగా ప‌నిచేసి దేశం మొత్తానికి ఆక్సిజ‌న్  స‌ర‌ఫ‌రా చేసింది, ఆస్ప‌త్రుల‌కు అప్ప‌టిక‌ప్పుడు మంచాలు త‌యారు చేసి యుద్ధ ప్రాతిప‌దిక‌న సంబంధిత ప‌నులు చేసింది విశాఖ స్టీల్ ప్లాంటే అన్న సంగ‌తి ఏ ఒక్క‌రూ మ‌రువ కూడ‌దు. క‌నుక ప్లాంట్ ను కాపాడుకోవాలి.. ప్లాంటుకు సంబంధించిన ఆస్తులు రాజ‌కీయ నాయ‌కుల జేబుల్లోకి ఖాతాల్లోకి పోకుండా కూడా చూడ‌గ‌ల‌గాలి.


విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ఇప్ప‌టికీ కొన్ని ఆశ‌లున్నాయి.ఫ్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు సంబంధించి నానా మాట‌లూ వినిపిస్తున్నా కొన్ని ప్ర‌తిపాద‌న‌లు అయితే వినేందుకు బాగానే ఉన్నాయి.వీటిలో ముఖ్య‌మ‌యిన‌ది విశాఖ స్టీల్ ప్లాంట్ ను ర‌త‌న్ టాటా టేకోవ‌ర్ చేసుకోవ‌డం.దీనిపైనే ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తోంది.ఇప్ప‌టికే ఎయిర్ ఇండియా సంస్థ‌ను సొంతం చేసుకుని ఇవాళ్టి నుంచి త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో స‌ర్వీసులు ప్రారంభించ‌నున్న టాటా కంపెనీ అదే ఒర‌వ‌డిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా కొనుగోలు చేస్తుంద‌ని ఓ ఆశ.


ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు బాగానే కాదు భారీగానే ఆస్తులు ఉన్నాయి. బ‌య‌ట ఆస్తుల విలువే ఓ వెయ్యి కోట్ల‌కు పైగా ఉంటుంది. అందుకే వైజాగ్ స్టీల్ ను అమ్ముకుంటేనే లాభ‌దాయ‌కం అని అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ఎక్కువ‌గానే ఆశ‌లు పెట్టుకుంటున్నాయి అన్న వాద‌న ఒక‌టి ప్లాంటు వాసుల నుంచి వినిపిస్తుంది.ఎందుకంటే భూముల‌ను అమ్ముకుని ఎవ‌రికి వారు ఆస్తులు పెంచుకోవ‌చ్చు అన్న అభిప్రాయం ఇరు పార్టీల‌లో ఉంది అన్న విమ‌ర్శ కూడా వినిపిస్తుంది.


ఇదే స‌మ‌యంలో ఇక్క‌డి ఉద్యోగ సంఘాలు కూడా రాజ‌కీయ పార్టీల‌తో చేతులు క‌లిపి ప్లాంట్ కు భ‌విష్య‌త్ అన్న‌ది లేకుండా చేస్తున్నార‌న్న వాద‌న సాక్షాత్తూ ఉద్యోగులలోనే వినిపిస్తుంది.ఇలాంటి ప‌రిణామాల్లో బీజేపీ కూడా కాస్తో కూస్తో త‌న సొంత లాభం చూసుకోకుండా ఎలా ఉంటుంద‌ని ఎప్ప‌టి నుంచో క‌మ్యూనిస్టు పార్టీలు ఆరోప‌ణ‌లు  చేస్తూ వ‌స్తున్నాయి. ఈ విధంగా ప్ర‌ధాన పార్టీల నాయ‌క వ‌ర్గాలు అన్నీ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌డం త‌ప్ప సాధించిందేమీ లేద‌ని తేలిపోయింది. ఈ ద‌శ‌లో ప్లాంటును టాటా కంపెనీ ఓన్ చేసుకుంటే మంచిది అన్న భావ‌న దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: