భారత దేశం 29 రాష్ట్రాల సమాహారం.. సగటున ఇండియాలో ఉన్న ఒక్కో రాష్ట్రం.. ప్రపంచంలోని అనేక దేశాల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉన్నాయి. అంటే.. ఇండియా అనేది కనీసం ఓ 20 దేశాలు కలిసి ఉన్నంత పెద్దది. కేవలం విస్తీర్ణంలోనే కాదు.. జనాభాలోనూ అంతే.. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో మన ఇండియానే సెకండ్.. కొన్ని ఏళ్లలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న చైనాను దాటేస్తాం కూడా. మరి ఇంతటి సువిశాల దేశంలో వివక్ష ఉంటోందా.. ప్రత్యేకించి ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య దూరం పెరుగుతోందా.. అన్న అనుమానాలు వస్తున్నాయి.


భారత దేశం ఏర్పడిన నాటి నుంచి కూడా దక్షిణాదిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా రాజ్యాధికారంలో వివక్ష ఉంది. హిందీ భాష కారణంగా ఆ భాష మాట్లాడే రాష్ట్రాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాజకీయంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల డామినేషన్‌ ఉంది. స్వతంత్ర్య భారతం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నా దక్షిణాది నుంచి ప్రధానులు అయ్యింది కేవలం ఇద్దరు మాత్రమే.. అందులో ఒకరైన పీవీ నరసింహారావు మాత్రమే ఐదేళ్లూ పాలించారు. దేవెగౌడ మాత్రం కొన్నినెలలే ప్రధానిగా పని చేశారు.


ఇప్పుడు బడ్జెట్‌లోనూ అదే జరుగుతోంది. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతోంది. ఇప్పుడు ఈ అంశాన్ని టీఆర్ఎస్‌ పార్లమెంట్ సాక్షిగా వినిపించింది. దేశంలో సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పడుతున్నాయని.. దక్షిణాది రాష్ట్రాలపై నిర్లక్ష్యం జరుగుతోందని.. దేశమే ప్రమాదంలో ఉందని అన్నారు. అసలు భారత్‌ అన్న ఆలోచనే ఇప్పుడు ప్రమాదం పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే అన్నారు. ఆర్థికంగా మనం విడిపోయినట్లు బుధవారం ఒక రాహుల్ గాంధీ చెప్పారని.. లౌకికంగా, సాంస్కృతికంగానూ దేశంలో విభజన వచ్చిందని.. మతాల మధ్య విద్వేషాలు సృష్టించడం దేశ మూల సిద్ధాంతానికి వ్యతిరేకమని కేకే అన్నారు.


బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక భారతీయత, అతివాద హిందుత్వం అన్న అంశాలు పదునెక్కాయన్న కేకే.. ఈ సంస్కృతి ఇలాగే కొనసాగి మన మెదళ్లను కలుషితం చేస్తే రెండు దేశాలను చూడాల్సి వస్తుందన్నారు. మరి వివాదం అంత వరకూ వెళ్తుందా..?

మరింత సమాచారం తెలుసుకోండి: