ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై వివాదాలు రోజు రోజుకూ విప‌రీతంగా పెరుగుతూ ఉన్నాయి. జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌కు కొంద‌రూ వ్య‌తిరేకిస్తుండ‌గా.. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రికొన్ని జిల్లా కేంద్రాల‌ను మార్చాలని కొంత మంది త‌మ ప్రాంతాన్ని జిల్లా ప్ర‌క‌టించాల‌ని వివిధ ర‌కాల అభ్యంత‌రాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇప్పుడు నేరుగా నంద‌మూరి బాల‌కృష్ణ ఇక రంగంలోకి దిగారు. కొత్త జిల్లాల ప్ర‌క‌టించినప్ప‌టి నుంచి అనంత‌పురం జిల్లాలో నిర‌స‌న‌లు మిన్నంటాయి. జిల్లాల ప్ర‌క‌ట‌న విష‌యంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని వైసీపీ నేత‌ల‌తో పాటు స్థానిక నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ఉన్నారు.
 
హిందూపురంలో నిర‌స‌న సెగ‌లు ఎగిసిప‌డుతున్నాయి. ఈ త‌రుణంలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ నేడు మౌన దీక్ష చేయ‌నున్నారు. హిందుపురాన్ని జిల్లా కేంద్రం చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఉద‌యం ప‌ట్ట‌ణంలోని పొట్టి శ్రీ‌రాములు విగ్ర‌హం నుండి అంబేద్క‌ర్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించ‌నున్నారు. త‌రువాత అంబేద్క‌ర్ విగ్ర‌హం ద‌గ్గ‌ర బాల‌కృష్ణ మౌన‌దీక్ష చేయ‌నున్నారు. మౌన దీక్ష త‌రువాత హిందూపురంపై త‌న డిమాండ్ ను మ‌రొక‌సారి ప్ర‌భుత్వానికి వినిపించ‌నున్నారు బాల‌య్య‌. బాల‌య్య హిందూపురం చేరుకున్నారు. ఆయ‌న‌ను క‌లిసేందుకు చూసేందుకు కార్య‌క‌ర్త‌లు అభిమానులు గుమిగూడారు. కొంద‌రూ సెల్పీల‌తో సంద‌డి చేసారు.

అదేవిధంగా బాల‌య్య స్థానిక డిమాండ్ల‌పై ఆరా తీసారు. ప్ర‌జ‌లు ఏమి కోరుకుంటున్నారని, వారి సెంటిమెంట్ ఏమిటి అన్న విష‌యాల‌పై పార్టీ నేత‌ల‌తో మాట్లాడి ఆరా తీశారు. మౌన‌దీక్ష ముగిసిన వెంట‌నే సాయంత్రం అఖిల‌ప‌క్షాల నేత‌ల‌తో చ‌ర్చించి.. భవిష్య‌త్‌పై ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ‌పై బాల‌య్య స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌నున్నారు. హిందూపురం కేంద్రంగా స‌త్యసాయి జిల్లాను ప్ర‌క‌టించాల‌ని ప్ర‌ముఖ సినీన‌టుడు హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ కొంత‌కాలంగా డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు వెంట‌నే త‌న మ‌న‌సులో మాట చెప్పారు బాల‌య్య‌. జిల్లాల ఏర్పాటు విష‌యంలో రాజ‌కీయం చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వానికి హిత‌వు ప‌లికారు. వైసీపీ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీ మేర‌కు ప్ర‌తి లోక్‌స‌భ  కేంద్రం జిల్లా కావాల‌ని బాల‌య్య పేర్కొన్నారు. స‌త్య‌సాయి జిల్లాలో హిందూపురానికి జిల్లా కేంద్రంగా చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేసారు. త‌న వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు కూడా చేసారు.  హిందూపురం అభివృద్ధి చెందింద‌ని.. జిల్లా కేంద్రానికి అవ‌స‌రం అయ్యే స‌దుపాయాలు అక్క‌డ పుష్క‌లంగా ఉన్నాయ‌ని గుర్తు చేసారు. ముఖ్యంగా హిందూపురం కేంద్రంగా స‌త్య‌సాయి జిల్లాను ప్ర‌క‌టించాల‌ని బాల‌య్య రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: