ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారి తీయవచ్చని ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న సమయంలో ఆ టెన్షన్‌ ఆంధ్రప్రదేశ్‌ను కూడా తాకింది. అక్కడి ఉద్రిక్తతలు, యుద్ధవాతారవణం నేపథ్యంలో అక్కడ విద్యనభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థుల గురించి కొంత ఆందోళన నెలకొంది. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆరా తీశారు. ఎంతమంది విద్యార్థులు ఉక్రెయిన్ విద్యాభ్యాసం చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. వారిని అప్రమత్తం చేశారు.


ఉక్రెయిన్ - రష్యాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల  తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఉక్రెయిన్లో చదువుతున్న విద్యార్థుల క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందని మంత్రి అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర  విద్యార్థులు ఉక్రెయిన్ లో ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణమే సమీపంలోని విద్యాశాఖ అధికారులకు తెలియ జేయాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ సూచించారు.  


ఏపీ విద్యాశాఖ అధికారులు విద్యార్ధుల తల్లిదండ్రులు సమాచారం ఇచ్చిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లి సహాయం చేయడానికి సహకరించాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేక మంది విద్యార్థులు విద్య కోసం ఉక్రెయిన్ వెళ్తుంటారు. ప్రత్యేకించి అక్కడ వైద్య విద్య మన ఇండియాతో పోలిస్తే చౌకని చెబుతారు. అలా విద్య కోసం వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది.


మరోవైపు ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం తప్పదని మొదట్లో భావించినా.. ప్రస్తుతం కాస్త ఉద్రిక్తలు సడలుతున్నాయి. రష్యా యుద్ధం ప్రారంభించవచ్చని ఇప్పటికే అమెరికా నిఘా వర్గాలే తేల్చి చెప్పినా.. తాజాగా అలాంటి సంకేతాలు ఏమీ కనిపించలేదు.  ఉక్రెయిన్ చుట్టూ మూడు ప్రాంతాల గుండా ఆక్రమణ చేసేందుకు రష్యా సన్నాహాలు చేస్తున్నా... ప్రస్తుతానికి మాత్రం సంయమనంతోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన విద్యార్థుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: