ఏపీ సీఎం జగన్ సొంత బాబాయి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది.
సీబీఐ చార్జ్ షీటులో కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డే వైఎస్‌ వివేకాను చంపించి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో ఈ కేసు కీలక దశకు చేరుకుంటోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడు దస్తగిరి అప్రూవర్‌ గా మారేందుకు ఒప్పుకున్నాడు.. హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది. ఇలాంటి సమయంలో దిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడప చేరుకోవడం ఉత్కంఠ రేపుతోంది.


వివేకా కేసు విచారణ కీలక దశకు చేరుకున్న సమయంలో సీబీఐ డీఐజీ కడపకు రావడం ఏదో తీవ్రమైన పరిణామమే ఉండొచ్చన్న ఊహాగానాలు సాగుతున్నాయి. దిల్లీ నుంచి కడపకు చేరుకున్న చౌరాసియా.. సీబీఐ అధికారులతో సమావేశమయ్యారు. వివేకా కేసు లేటెస్టు అప్‌డేట్స్ గురించి చర్చించినట్టు తెలుస్తోంది. వివేకా హత్య కేసు నిందితులు కడప కేంద్ర కారాగారంలోనే ఉన్న సంగతి తెలిసిందే. వారిని ఇటీవల జైలులోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారించారు.


తాజాగా సీబీఐ అధికారులు పులివెందులకు చెందిన శ్రీనివాస్‌రెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. శ్రీనివాసరెడ్డి పులివెందులలోని రాజారెడ్డి ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్‌. ఆయన వివేకా హత్య జరిగిన రోజు మృతదేహానికి కట్టు కట్టిన విషయంలో అతని ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి అక్కడే ఉన్నట్టు సీబీఐకు సమాచారం ఉంది. మరిన్ని వివరాల కోసం అతడిని సీబీఐ అధికారులు విచారించారు.


ఇప్పటికే చార్జ్ షీటు దాఖలైనందువల్ల.. నిందితులు ఎవరో.. కారకులు ఎవరో సీబీఐ ఓ అంచనాకు వచ్చినందువల్ల అరెస్టుల కోసమే చౌరాసియా వచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఈ కేసులో పెద్ద నాయకులను అరెస్టు చేస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉండటం వల్ల పరిస్థితిని చక్కదిద్దేందుకే చౌరాసియా వచ్చారన్న ప్రచారం కూడా జరుగుతోంది..మరి ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా.. చౌరాసియా రాక అందుకు కారణమా అన్న ఉత్కంఠ అయితే ఉంది. చూడాలి.. మరి ఏం జరుగుతుందో..ఏ సంచలనాలు నమోదు కానున్నాయో..?

మరింత సమాచారం తెలుసుకోండి: