శ్రీనివాస్ ఓ టెంపో డ్రైవర్.. ప్రయాణికులను తీసుకుని గోవా వెళ్లాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకు హైదరాబాద్ తిరిగొచ్చాడు. కానీ ఆయన తిరిగి వచ్చి తీరు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఒళ్లంతా కుట్లతో అసలు ఎవరకూ గుర్తుపట్టని విధంగా తిరిగివచ్చాడు. హైదరాబాద్‌లోని బోరబండలో జరిగిన ఈ ఘటు అనేక అనుమానాలు రేకిత్తిస్తోంది. గోవాలోని అవయవాల దందా ముఠాకు శ్రీనివాస్ చిక్కి ఉంటాడని.. ఆయన అవయవాలను తీసేసుకుని ఆయన్ను పంపించారని స్థానికులు భావిస్తున్నారు. శ్రీనివాస్ పరిస్థితి చూస్తే..  కొన్నిరోజుల క్రితం వచ్చిన డాక్టర్ సినిమా కథ
గుర్తుకు రాక మానదు.


అసలేమైందంటే..  బోరబండకు చెందిన టెంపో డ్రైవర్‌ శ్రీనివాస్  10 మంది ప్రయాణికులతో మార్చి 19న గోవా వెళ్లాడు.  అక్కడికి వెళ్లినప్పటి నుంచి శ్రీనివాస్‌ ఆచూకీ లభించలేదు. శ్రీనివాస్ డ్రైవ్ చేసిన టెంపోలో గోవా వెళ్లిన వారు.. డ్రైవర్ కనిపించడం లేదని టెంపో ఓనర్‌ కు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకుని కంగారు పడిన శ్రీనివాస్ కుటుంబసభ్యులు గోవా వెళ్లి శ్రీనివాస్‌ కోసం వెదికారు. ఎంత ప్రయత్నించినా శ్రీనివాస్ ఆచూకీ దొరకలేదు.


చేసేదేమీ లేక..  గోవాలోని అంజున పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి తిరిగివచ్చేశారు. అదృశ్యమైనప్పటి నుంచి శ్రీనివాస్‌ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఆ తర్వాత టెంపో యజమాని స్వయంగా గోవా వెళ్లి ప్రయాణికులను హైదరాబాద్ తీసుకువచ్చాడు.


అలా గోవాలో మాయమైన శ్రీనివాస్‌ ఇటీవల హైదరాబాద్‌ వచ్చాడు. అయితే.. అతడిని చూసి కుటుంబసభ్యులు షాక్‌ అయ్యారు. శ్రీనివాస్ తల, పొట్ట అంతా కుట్లు ఉన్నాయి. ఏమైందన్న విషయంపై శ్రీనివాస్ సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నాడు. శ్రీనివాస్‌కు మత్తు మందు ఇచ్చి అవయవాలు తీసుకున్నారేమో అన్న అనుమానం కుటుంబ సభ్యులను వేధిస్తోంది. శ్రీనివాస్ గురించి మీడియాలో కథనాలు రావడంతో  కార్పొరేటర్‌ బాబా ఫసియుద్దీన్‌ స్పందించారు. శ్రీనివాస్‌ను నిమ్స్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శ్రీనివాస్‌ కోలుకుంటే తప్ప అసలేం జరిగిందో తెలిసే పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: