విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీకి తలనొప్పిగా మారింది. పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్ఠానం దృష్టి సారించినా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎమ్మెల్యే వాసుపల్లి గణే ష్ కి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్‌ మధ్య విభేదాలున్నాయనే విషయం తెలిసందే. అయితే ఆ విభేదాలు ఇప్పుడు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఆ గొడవల్లో ఎమ్మెల్యే వాసుపల్లి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయనతో మాట్లాడేందుకు అధిష్టానం ప్రయత్నించినా అది కుదర్లేదు. వాసుపల్లి టచ్ లోకి రాకపోవడంతో తాడేపల్లి నుంచి అధిష్టానం సుధాకర్ కి కబురు పంపింది. అసలు అక్కడ ఏం జరుగుతోందని ఆరా తీసింది.

బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చి ఉత్తరాంధ్ర సమన్వయకర్త సుబ్బారెడ్డిని కలసి వెళ్లారు. పార్టీ అధిష్టానం మాట ప్రకారమే తాను ప్రజల్లోకి వెళ్తున్నానని చెప్పారు సుధాకర్. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నానని, ప్రజల్లో వైసీపీకి మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నానని వివరించారు. అదే సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లి వర్గంతో ఉన్న విభేదాలను కూడా ఆయన నాయకులకు తెలియజేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌, ఆయన అనుచరులు, టీడీపీనుంచి వచ్చి వైసీపీలో చేరిన కార్యకర్తల వ్యవహార శైలి వల్ల వైసీపీ పార్టీ శ్రేణులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

అయితే వాసుపల్లి వాదన మరో రకంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి కూడా పార్టీలో తన మాట చెల్లుబాటు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుధాకర్. ఆలయ కమిటీలు, మసీదు కమిటీల నియామకంలో తన మాట చెల్లుబాటు కావడంలేదని వాసుపల్లి ఫీలవుతున్నారట. అందుకే ఆయన అధిష్టానం పిలిచినా ఆయన రాలేదట. తనకు తానుగా రాజీనామా చేయడం, అధిష్టానం పిలిస్తే రాకుండా ఉండటంతో వాసుపల్లిపై జగన్ కూడా గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఒకరకంగా నియోజకవర్గంలో బూత్ కమిటీల నియామక వేళ.. ఎమ్మెల్యే వాసుపల్లి జగన్ కు తలనొప్పిగా మారారు. మరి దీనికి విరుగుడుగా జగన్ ఏం చేస్తారో చూడాలి. అక్కడ సుధాకర్ ని అభ్యర్థిగా ప్రకటిస్తారా, లేక వాసుపల్లితో సయోధ్య చేసుకుని ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇస్తానంటారా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: