పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీసుకున్న తాజానిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇలాగే అనిపిస్తోంది. నరేంద్రమోడీతో వైరం ఎందుకనుకున్నారో లేకపోతే మోడీని ఏమీ చేయలేమని అనుకున్నారో తెలీటంలేదు. మొత్తానికి మోడీకి మమత సరెండర్ అయినట్లే అనిపిస్తోంది. లేకపోతే ఉపరాష్ట్రపతిగా పోటీచేస్తున్న తన బద్ధశతృవు జగదీప్ ధనకర్ గెలుపుకు మమత మద్దతివ్వటం ఏమిటి ? ప్రత్యక్షంగా ధనకర్ కు మద్దతు ప్రకటించలేదు కానీ అయితే ఎన్నికనే బహిష్కరించారు.





మద్దతుగా నిలబడినా, ఎన్నికను బహిష్కరించినా వచ్చే ఫలితం ఒకటే అన్న విషయం తెలియనంత అమాయకులు ఎవరు లేరు. నూరుశాతం ధనకర్ కు వ్యతిరేకంగా మమత పనిచేస్తేనే మోడీని వ్యతిరేకించినట్లన్న విషయం తెలిసిందే. సో మమత ప్రకటన చూసిన తర్వాత దీదీ చాలా తెలివైనదనే అనుకోవాలి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో తనను తాను చాలా బలవంతుడిని అనుకుని మోడీని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు పరిస్ధితి ఏమైందో అందరు చూస్తున్నదే.





మోడీని పూర్తిగా వ్యతిరేకించి చతికిలపడిన చంద్రబాబు ఇపుడు గిలగిల్లాడుతున్నారు. మోడీకి వ్యతిరేకంగా ఏమీచేయలేక అలాగని మళ్ళీ బీజేపీకి దగ్గరకాలేక నానా అవస్తలు పడుతున్నారు. బహుశా ఇదంతా నేరుగా చూస్తున్న మమతలో కూడా పునరాలోచన వచ్చినట్లుంది. నాన్ ఎన్డీయే పార్టీల్లో దేనికి కూడా బీజేపీని ఎదుర్కోలేనంత సీన్ లేదని అర్ధమైపోయినట్లుంది. ఈమాత్రం దానికి ఊరికే ఎగిరెగిరి పడటం ఎందుకనుకున్నారో ఏమో వెంటనే సరెండర్ అయిపోయారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.






ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా మార్గరెట్ ఆల్వాను ఎంపికచేయటంలో తమ అభిప్రాయాన్ని తీసుకోలేదన్న చిన్న కారణాన్ని చూపించి ఏకంగా ఎన్నికనే బహిష్కరిస్తున్నట్లు మమత ప్రకటించారంటేనే అర్ధమైపోతోంది తెరవెనుక ఏదో జరిగిందని. ఈమధ్యనే అస్సా సీఎం సమక్షంలో థనకర్-మమత భేటీ అవ్వటం మిగిలిన ప్రతిపక్షాల అనుమానాలను పెంచేస్తోంది. ఇపుడు మమత తీసుకున్న నిర్ణయం వల్ల లాభమా లేదా నష్టమా అన్నది తేలాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఏదేమైనా తాను కూడా ఎంతమాత్రం నమ్మదగ్గ నేతను కానని మరోసారి మమత నిరూపించుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: