జగన్మోహన్ రెడ్డి వింత పోకడలకు పోతున్నారు. చివరకు రాష్ట్రప్రభుత్వాన్ని ఒక ప్రైవేటు కంపెనీలాగ మార్చేశారు. అందుకనే చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టు సృష్టించారు. ఈ కొత్తపోస్టులో రిటైర్ అవబోతున్న సమీర్ శర్మను నియమించారు. ఇంతకీ శర్మ కొత్తపోస్టు ఏమిటంటే సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అట. అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పూర్తికాలపు ఛైర్మన్ గా కూడా నియమించారు. ఈ పోస్టులో ఉంటూనే సీఎంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా కూడా కంటిన్యు అవుతారట.





కొత్త బాధ్యతల్లో ఏమిచేస్తారంటే రాష్ట్రం సుస్ధిరాభివృద్ధి సాధించేందుకు వీలుగా అన్నీ శాఖలను సమన్వయం చేస్తారట. ప్రణాళికలను తయారుచేసి వాటిని అమలుచేస్తారట. ముఖ్యమంత్రికి నివేదికలను అందిస్తు ప్రజంటేషన్లు ఇస్తారట. అలాగే అఖిలభారతసర్వీసు అధికారుల పనితీరును అంచనా వేయటంలో సీఎంకు సాయంచేస్తారట. విచిత్రంగా ఉందా ఇదంతా చూస్తుంటే. ఎందుకంటే కొత్తపోస్టులో శర్మ చేస్తారని ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేయాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీది.





చీఫ్ సెక్రటరీ బాధ్యతలన్నీ రిటైర్ అయిన శర్మ చేస్తే ఇక చీఫ్ సెక్రటరీ ఏమిచేయాలి ? అసలు ఉన్నతాధికారుల్లో ఎవరైనా చీఫ్ సెక్రటరీని లెక్కచేస్తారా ? సీఈవో అంటే కంపెనీల్లో ఓనర్ కమ్ అత్యున్నత స్ధాయివ్యక్తి.  సీఎంకే శర్మ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నతర్వాత ఇక చీఫ్ సెక్రటరీ ఉండి ఏమిటి ఉపయోగం ?  ఒకపుడు చంద్రబాబునాయుడు కూడా తనను తాను ముఖ్యమంత్రిగా పిలిపించుకోవటం కన్నా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా పిలిపించుకోవటానికి ఎక్కువ ఇష్టపడేవారు. ఇపుడు జగన్ వ్యవహారం కూడా అలాగే అనిపిస్తోంది. కాకపోతే చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో తానుండకుండా శర్మను నియమించారంతే.





ఏదేమైనా జగన్ పోకడలు మాత్రం చాలా విచిత్రంగా మారిపోతున్నాయి. మద్దతుదారులను సలహాదారులుగా నియమించుకోవటం, రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ లను ఏదో పోస్టులో తిరిగి నియమించుకోవటం ఎక్కువైపోయింది. అసలు ప్రభుత్వంలో ఎవరే పనిచేయాలి ? ఏం పనిచేస్తున్నారు ? అనే విషయంలో  వాళ్ళ పనితీరును మదింపు చేసేవాళ్ళు కూడా లేరు. ఉద్యోగంలో ఉన్నవారికన్నా రిటైర్ అయిన వాళ్ళ  పెత్తనమే ప్రభుత్వంలో ఎక్కువైపోతోంది. ఇది ప్రభుత్వానికి ఏమాతరం మంచిదికాదనే విషయాన్ని జగన్ ఎప్పటికి గ్రహిస్తారో ?

మరింత సమాచారం తెలుసుకోండి: