కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహూల్ గాంధీపై బహిష్కరణ వేటువేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్లమెంటులో గడచిన మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలు కూడా దీన్నే సూచిస్తున్నాయి. విదేశీ పర్యటనలో  రాహూల్ మాట్లాడుతు భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో నిజాలను నిర్భయంగా మాట్లాడే స్వేచ్చకూడా లేదన్నారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ చాలా సీరియస్ గా తీసుకుంది.

పార్లమెంటు సమావేశాలు మొదలైన దగ్గర నుండి రాహూల్ క్షమాపణలు చెప్పాల్సిందే అని బీజేపీ ఎంపీలు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో రాహూల్ మాట్లాడిందాంట్లో తప్పేమీలేదు కాబట్టి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్, యూపీఏ సభ్యులు ఎదురుతిరుగుతున్నారు. ఈ గొడవతోనే పార్లమెంటు జరగటంలేదు. విదేశాల్లో తాను ఏమి మాట్లాడాను అనే విషయమై వివరణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని రాహూల్ స్పీకర్ ను కోరినా ఉపయోగం కనబడలేదు.

ముందు రాహూల్ క్షమాపణలు చెప్పిన తర్వాత మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీలు పట్టుబట్టారు. దాంతోనే సమావేశాలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపధ్యంలోనే రాహూల్ మీద బహిష్కరణ వేటు వేస్తే సరిపోతుందనే చర్చ కూడా బీజేపీలో మొదలైంది. విదేశాల్లో దేశం పరువు తీస్తున్న రాహూల్ కు పార్లమెంటులో ఉండే అర్హత లేదని కమలనాదులు భావిస్తున్నారట. రెండువైపుల గొడవలు చూస్తుంటే ఇప్పట్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎవరు అనుకోవటంలేదు.

అందుకనే మధ్యేమార్గంగా రాహూల్ వ్యాఖ్యలపై విచారించేందుకు పార్లమెంటరీ ప్రత్యేక కమిటీని నియమించాలని ఇప్పటికే ఎంపీ నిషికాంత్ దుబే స్పీకర్ కు లేఖరాశారు. దాని ప్రకారమే ప్రత్యేక కమిటీని నియమించి దాని ద్వారా బహిష్కరణ సిఫారసును తెప్పించుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే గతంలో నరేంద్రమోడీ విదేశాలకు వెళ్ళినపుడు కాంగ్రెస్ పార్టీ గురించి చాలా అవమానకరంగా మాట్లాడారు. దేశం ఎదుర్కొంటున్న అన్నీ సమస్యలకు కాంగ్రెసే కారణమన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. అప్పటినుండే రాహూల్ కూడా మోడీ ప్రభుత్వంపై విదేశాల్లో మాట్లాడుతున్నారు. చివరకు ఈ గొడవ ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: