వంద ఎలుకలను వేటాడి తిన్న పిల్లి కూడా అవసరం వచ్చినపుడు తాను పూర్తి శాకాహారినే అనిచెప్పిందట. చికోటి ప్రవీణ్ వ్యవహారం కూడా అలాగే ఉంది. థాయ్ ల్యాండ్ లోని పట్టాయాలో పట్టుబడిన తర్వాత చికోటి మాట్లాడుతు తాను గ్యాంబ్లింగ్ ఆడలేదట. అసలు థాయ ల్యాండ్ లో గ్యాంబ్లింగ్ నిషేధం అన్న విషయమే తనకు తెలీదంటున్నారు. దేవ్ సీత అనే వ్యక్తుల నుండి అందిన ఆహ్వానం వల్లే తాను థాయ్ ల్యాండ్ కు వెళ్ళినట్లు చెప్పాడు.





పోకర్ టోర్నమెంటు ఉంది రమ్మని పై ఇద్దరు చికోటికి ఆహ్వానం పంపారట. అదేంటో చూద్దామనే తాను థాయ్ ల్యాండ్ కు చేరుకున్నట్లు చికోటి చెప్పటం విచిత్రంగానే ఉంది. క్యాసినో నిర్వహణకు తనకు ఎలాంటి సంబంధంలేదన్నారు. గ్యాంబ్లింగ్ జరుగుతున్న హాలులోకి తాను వెళ్ళిన పదినిముషాలకే పోలీసులు దాడి చేసినట్లు ప్రవీణ్ చెప్పారు. తన నిర్దోషిత్వాన్ని పోలీసుల దగ్గర నిరూపించుకున్నట్లు కూడా చెప్పారు. మొత్తానికి గ్యాంబ్లింగ్ లో పట్టుబడిన చికోటి అసలా క్యాసినోతో తనకు సంబంధమే లేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.





చికోటి అంటేనే గ్యాంబ్లింగ్ నిర్వాహకుడని బాగా ప్రచారంలో ఉంది. గతంలో తెలుగురాష్ట్రాల నుండి పెద్దఎత్తున బాగా డబ్బున్న వాళ్ళని నేపాల్, శ్రీలంకకు తీసుకెళ్ళినట్లు ఆరోపణలున్నాయి. క్యాసినో నిర్వహణ ద్వారా వందల కోట్ల రూపాయల మనీల్యాండరింగ్, హవాలా చేస్తున్నట్లు కేసులు కూడా నమోదయ్యాయి. వీటిపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా జరుపుతోంది. గుడివాడలో మూడురోజుల పాటు క్యాసినో నడిపినట్లు ఫిర్యాదులు కూడా ఉన్నాయి.




చికోటి అంటేనే క్యాసినో నిర్వాహకుడని ఎవరైనా చెప్పేస్తారు. అలాంటి చికోటి తనకు థాయ్ ల్యాండ్ చట్టాలు తెలీవని, హోటల్లో గ్యాంబ్లింగ్ జరుగుతోందని తెలీదంటే ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి వృత్తి గ్యాంబ్లర్లు, క్యాసినో నిర్వాహకులకు ఆయా దేశాల్లోని ప్రముఖుల్లో  ఎవరినుండో గట్టి మద్దతు ఉండే ఉంటుందనటంలో సందేహంలేదు. ప్రముఖుల మద్దతు లేకపోతే అంత ధైర్యంగా వేరే దేశాలకు పదులసంఖ్యలో తీర్ధయాత్రలకు తీసుకెళ్ళినట్లు డబ్బున్నవాళ్ళని క్యాసినో ఆడించేందుకు తీసుకెళ్ళడు. ఇపుడు పట్టుబడ్డాడు కాబ్టటి థాయ్ కోర్టు ఏమి చెబుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: