కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న యాదాద్రి ఆలయంలో తన విగ్రహాలు వివాదాస్పంద కావడంతో ముఖ్యమంత్రి వెనక్కితగ్గారు. వివాదాలకు తావు లేకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం కార్యాలయం ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయం స్తంభాలపై ముద్రించిన ముఖ్యమంత్రి కెసిఆర్ బొమ్మలను తొలగించారు. వాటితో పాటు రాజకీయంగా విమర్శలు వచ్చిన కారు తదితర గుర్తులను కూడా తొలగించారు.


ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు దైవ సంబంధ బొమ్మలు మినహా మిగతా ఏ రకమైన చెక్కడాలు ఉండకుండా చెరిపి వేసినట్లు ప్రధాన ఆర్కిటెక్ట్ ఆనందాచారి తెలిపారు. ఆలయ ప్రాకార మండపంలో రాజకీయ అంశాలకు చెందిన బొమ్మల చెక్కడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఒక శిల్పి తన సొంత నిర్ణయంతో చేసింది మాత్రమేనని ఆయన వివరణ ఇచ్చారు.


వివాదాస్పద చిత్రాలు తొలగించామని.. ఇక పూర్తిగా దైవ సంబంధిత చిత్రాలు మాత్రమే ఉంటాయని ఆయన ఫుల్ క్లారిటీతో చెప్పేశారు. తొలగించిన బొమ్మల స్థానంలో లతలు, పద్మాలు, హంసలతో పాటు దైవ సంబంధమైన బొమ్మలను చెక్కడానికి మార్కింగ్‌ లైన్లు వేశారు. కేసీఆర్‌ చిత్రం ఉన్న రాతిస్తంభంపై సుదర్శన చక్రం చెక్కుతున్నారు.


కేసీఆర్ ఆదేశాలతో ఇప్పుడు ఆ విగ్రహాలను చెరిపేస్తున్నా... రెండు రోజల క్రితం వరకూ ఇక్కడి శిల్పులు, అధికారులు వింత వాదనలు వినిపించారు. మన చరిత్రను భావితరాలకు తెలిపేందుకే అలా చెక్కించామని యాదాద్రి టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, సీఈవో కిషన్‌రావు చెప్పారు. ఏ దేవాలయంలోనైనా ఆనాటి కాలంలోని పరిస్థితులను తెలిపేవిధంగా శిల్పులు శిలలను చెక్కుతారని సమర్థించుకున్నారు. అంతేకానీ వారికి వేరే ఉద్దేశాలు ఉండవని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే యాదాద్రి ఆలయ స్తంభాలపై కేసీఆర్ కిట్స్, చార్మినార్, తెలంగాణ మ్యాప్, తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర తదితర బొమ్మలు చెక్కినట్టు చెప్పారు.


శిల్పాలను చెక్కే శిల్పులకు ఫలానా బొమ్మలే చెక్కాలనే నియమం ఉండదని, చరిత్రలో ఉండాలని భావించిన బొమ్మలను చెక్కుతారని కిషన్‌రావు తెలిపారు. ఇందులోభాగంగానే యాదాద్రి ఆలయం బయటి ప్రాకారం స్తంభాలపై మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, కమలం పువ్వు, ఎడ్లబండి, సైకిల్, కారు, క్రికెట్ ఆట, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితర బొమ్మలను చెక్కారని చెప్పారు. కేసీఆర్ బొమ్మను చెక్కడాన్ని వ్యక్తిగతంగా చూడకూడదని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం కేసీఆర్ జోక్యం చేసుకోవడంతో మొత్తానికి వివాదం ఓ కొలిక్కి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: