కొంత కాలం క్రితం టీడీపీ నేతలంతా బీజేపీలోకి క్యూ కట్టేశారు. వీరిలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరున్నవారు కూడా ఉండటం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ వంటి కార్పొరేట్ నేతలు కూడా చంద్రబాబును వదిలేసి బీజేపీలో చేరిపోయారు. అయితే వీరు చేరింది బీజేపీపై ప్రేమతో కాదని.. తమ సంస్థలకు చెందిన కేసులు తమను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకేనని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి.


అధికార పార్టీలో చేరిపోతే.. ఇక కేసుల ఇబ్బంది ఉండన్న కోణంలోనే ఈ చేరికలు సాగాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ వారికి షాక్ ఇస్తోంది. పార్టీలోకి వచ్చినా అవినీతి కేసుల నుంచి ఊరట ఉండబోదని ఆ పార్టీ నేత ఒకరు సంచలన ప్రకటన చేశారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు.. ఇలాంటి నేతలను ఉద్దేశించి కామెంట్ చేశారు.


రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చే విషయంలో భాజపా ఒక ప్రతిపక్ష పాత్రను సమర్ధవంతంగా నిర్వహిస్తుందని చెప్పుకొచ్చిన మురళీధర్ రావు.. ఈడి , ఐటి వంటి ప్రభుత్వ శాఖలు చేసే సోదాలు, విచారణలను ప్రభుత్వం యంత్రాంగం చేసే పనిగా చూడాలని కామెంట్ చేశారు. అధికార పార్టీలోకి వస్తే కేసులు నుంచి రక్షణ ఉంటుందని బీజేపీలో చేరే వారికి భంగపాటు ఖాయమని ఆయన అన్నారు.


బీజేపీలో ఉన్న వారిపై కూడా సోదాలు, విచారణ లు జరిగాయి.. జరుగుతాయి అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు స్పష్టం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఆయన ఆ మాటలు యథాలాపంగా అన్నారా..లేక ఏదైనా వ్యూహం ప్రకారమే మాట్లాడారా అన్నది ఇప్పుడు అటు బీజేపీలోనూ.. ఇటు టీడీపీ నేతల్లో ఆసక్తిరేపుతున్న ప్రశ్న. మరి ఇప్పడుు దీనిపై కార్పొరేట్ నేతలు ఎలా స్పందిస్తారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: