ఇప్పటికే తెలంగాణాలో
తెలుగుదేశంపార్టీ పరిస్దితి ఐసియులో ఉన్నట్లుంది. దానికితోడు తొందరలో హుజూర్ నగర్
ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నికలో పోటి చేస్తే ఒక సమస్య. పోటి చేయకపోతే మరొక
సమస్య. క్షేత్రస్ధాయిలో పరిస్ధితిని గమనిస్తే పోటి చేసి గెలిచేంత సీన్ టిడిపికి
లేదని చెప్పాల్సిందే.
ఎందుకంటే పార్టీకి నేతలు లేరు, కార్యకర్తలు కూడా పెద్దగా లేరనే చెప్పాలి. క్షేత్రస్ధాయిలో బలమున్న నేతలు, వాళ్ళ మద్దతుదారుల్లో చాలామంది టిఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. మిగిలిన నేతల్లో కొందరు కాంగ్రెస్ లో చేరితే అరా కొర నేతలు బిజెపిలో చేరిపోయారు. ప్రస్తుతానికి టిడిపిలో మిగిలిన నేతలంతా అడుగు బొడుగే.
వీళ్ళల్లో చాలామందికి జనాల్లో బలమే లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో హుజూర్ నగర్ ఉప ఎన్నిక రావటమంటే టిడిపికి ఇబ్బందికరమైన పరిస్దితనే చెప్పాలి. అదే సమయంలో సిట్టింగ్ సీటు కాబట్టి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అలాగే అధికారంలో ఉంది కాబట్టి తమ అభ్యర్ధిని గెలిపించుకోవాలని టిఆర్ఎస్ పోరాటం చేస్తోంది.
అదే సమయంలో ఉపఎన్నికలో గెలిచి తమ సత్తా ఏంటో చాటాలని బిజెపి కూడా ఎగిరెగిరి పడుతోంది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లలో గెలిచినప్పటి నుండి బిజెపి నేతలు అసలు నేలపై నడవటం మానేశారు లేండి. దాంతో వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే అంటూ ఒకటే ఊదరగొట్టేస్తున్నారు.
అంటే ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు టిఆర్ఎస్, అలాగే బిజెపిలు ఎవరికి వారే గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పై మూడు పార్టీల పరిస్ధితి ఇలాగుంటే టిడిపి పరిస్ధితి ఏంటి ? ఏమిటంటే ఈరోజు తెలంగాణాలోని పార్టీ నేతలతో సమావేశమవబోతున్నారు చంద్రబాబు.
ఎందుకయ్యా అంటే పోటి చేయాలా ? వద్దా ? అని అభిప్రాయాలు తెలుసుకోవటం కోసమట. సరే నేతలు ఏం చెబుతారో తెలీకపోయినా నన్నూరి నర్సిరెడ్డి లాంటి నేతలైతే పోటికి సై అంటున్నారు. ఈ ఉపఎన్నికతో తెలంగాణాలో టిడిపి భవిష్యత్తేంటో ఫైనల్ అయిపోతుందనే అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి