శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వచ్చాక బేగంపేట ఎయిర్ పోర్టు ఖాళీగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో ప్రముఖులు వచ్చినప్పుడు ప్రత్యేక విమానాలు దిగటానికి తప్ప బేగంపేట ఎయిర్ పోర్ట్ వాడటం లేదు. నగరం నడి మధ్యన వందల ఎకరాలున్న ఎయిర్ పోర్టు నిరుపయోగంగా మారింది.


అందుకే ఆ ఎయిర్ పోర్టు తమకు ఇచ్చేయమంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం యూనైటెడ్ కింగ్ డం లోని ప్రముఖ యూనివర్సిటీ తో కలిసి శిక్షణ కార్యక్రమాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నదని, ఇందుకోసం బేగంపేట ఎయిర్పోర్ట్ ని ఉపయోగించుకునేలా వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కోరారు.


ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో “తెలంగాణ శానిటేషన్ హబ్” ఏర్పాటుకోసం సహకరించాల్సిందిగా కూడా కోరారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా మొత్తం భారతదేశంలోని ఇతర ఇతర రాష్ట్రాలకు కూడా పారిశుద్ధ్య రంగంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు కావాల్సిన పరిష్కారాలను కనుగొనే విధంగా ఈ హబ్ పరిశోధన కొనసాగిస్తుందని తెలిపారు.


ఈ కేంద్రం ద్వారా పారిశుద్ధ్య రంగంలో ఉన్న అదర్శ విధానాలు మరియు పరిశోధనను పెంచేలా కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా తో కలిసి పని చేస్తుందని తెలిపారు. ఈ హబ్ ద్వారా దేశంలోని పురపాలికల్లో పారిశుద్ధ్యం, ఇతర అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని ముందుకు పోయేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా సానిటేషన్ రంగంలో గుణాత్మకమైన మార్పు సాధించేందుకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి వంద కోట్ల రూపాయల సీడ్ ఫండింగ్ అందించాలని కోరారు


హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుకి అదనంగా చేపట్టాల్సిన కార్యక్రమాల కోసం మరో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను స్వచ్ఛ భారత్ మిషన్ లేదా మరే ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కింద అయినా కేటాయించాల్సిందిగా కోరారు. దీంతోపాటు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం కేటాయించిన నిధుల్లో కేంద్రం నుంచి రావాల్సిన 254 కోట్ల రూపాయల వెంటనే బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: