ఏపీలో కొన్నిరోజులుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రత్యేకించి పవన్ కల్యాణ్ జగన్ సర్కారుపై మండిపడుతున్నారు. ఇంగ్లీషు, ఇసుక అంశాలపై గళమెత్తుతున్నారు. తాజాగా ఆయన ఢిల్లీ కూడా వెళ్లారు. అక్కడి నుంచి ట్విట్టర్ లో ఓ సంచలన పోస్టు పెట్టారు. వైఎస్ జగన్ ది రివెంజ్ పాలిటిక్స్ అంటూ విమర్శించారు. ఏపీలో జగన్‌ పరిపాలన పగతీర్చుకునే విధంగా, సరైన కొలమానం లేకుండా సాగుతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇది ఢిల్లీ మాట అంటూ... వైసీపీ ప్రభుత్వ పాలనపై ఇంగ్లిష్‌ పత్రికలు ఈ నెలలో రాసిన సంపాదకీయాలను ఆయన తన పోస్టుకు అటాచ్ చేశారు.


సీఎం జగన్‌వి తిరోగమన రాజకీయాలని, పరిపాలనలో ఆయనకు ఒక దృక్కోణం కావాలన్న ఆర్టికల్స్ ను ఆయన కోట్ చేశారు. దేశంలోని యువ ముఖ్యమంత్రుల్లో ఒకరైన 47 ఏళ్ల జగన్‌రెడ్డి పరిపాలన భయాందోళన కలిగిస్తోందని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ముద్ర లేకుండా చేయాలని బాహాటంగానే చేపడుతున్న వరుస చర్యల్లో భాగంగా రాజధాని అమరావతిలో 6.84 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్‌ స్టార్టప్‌ కోసం సింగపూర్‌ కన్సార్షియంతో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేస్తున్నారని ఆ వ్యాసాలు చెబుతున్నాయి.


ఇంకా ఆ వ్యాసాలు ఏం చెబుతున్నాయంటే.. “ ఈ స్టార్టప్‌ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్లే అండ్‌ ప్లగ్‌ కార్యాలయాల ఏర్పాటు పూర్తయి ఉంటే 50 వేల ఉద్యోగాలు లభించేవి. జగన్‌ ప్రభుత్వానికి చంద్రబాబు కోరుకున్న రీతిలో ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడం ఇష్టం లేని నేపథ్యంలోనే ఈ ప్రాజెక్టు రద్దు నిర్ణయాన్ని చూడాలి’ అని ఇంగ్లిష్‌ పత్రిక ప్రచురించిన కథనాన్ని వవన్‌ పోస్ట్‌ చేశారు.


మరో పత్రిక కథనంలో ఇలా ఉంది.. “ అమరావతిలో స్టార్టప్‌ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, వర్తమాన భారతదేశానికి అత్యావశ్యకమైన పట్టణాభివృద్ధికి పెద్ద విఘాతం. ఈ నిర్ణయం భారత్‌లోని విదేశీ పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీసింది. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం జగన్‌ వెంటనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలి’’ అని ఆ కథనం సూచించింది. అయితే ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ అక్కడ ఏం జరిగిందో మాత్రం పోస్టులు పెట్టకపోవడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: