రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. ఎవరైనా ఎప్పుడైనా పార్టీలు మారొచ్చు. వీరు పార్టీ మారరు అనుకోవడానికి లేదు. రాజకీయాల్లో ఫిరాయింపులు అంత ఈజీ అయ్యాయి. సుజనా చౌదరి, సీఎం రమేశ్ వంటి చంద్రబాబు సన్నిహితులే పార్టీలు మారారు. అంతెందుకు మొన్నగాక మొన్న మహారాష్ట్రలో అజిత్ పవార్ ఏకంగా అధికారం కోసం బీజేపీ చంకలో దూరారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఓ వైసీపీ ఎంపీ బీజేపీ ఆఫీసు ముందు ప్రత్యక్షమయ్యారు. అసలు వైసీపీ నేతలు బీజేపీలో టచ్ లో ఉన్నారని ఇటీవలే సుజనా చౌదరి కూడా కామెంట్ చేశారు. అందుకే ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఆ ఎంపీ ఎవరంటారా.. ఆయనే రఘురామ కృష్ణంరాజు.
ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో ఏళ్ళు కాకపోయినా ఇప్పటికే పలు పార్టీలు మారారు. ముందు టిడిపి ఆ తర్వాత బిజెపి.. అటు నుంచి వైసీపీ.. మళ్లీ బిజెపి.. అక్కడి నుంచి మళ్లీ టీడీపీ.. అక్కడి నుంచి మళ్లీ వైసీపీ ఇలా ఆయన జంపింగుల్ కొనసాగాయి. రఘురామకృష్ణంరాజు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్లారంటే రాజకీయాలు ఫాలో అయ్యేవారు కూడా కాస్త కంగారు పడతారు.
అలాంటి రామకృష్ణంరాజు.. బీజేపీ ఆఫీసులు ముందు ప్రత్యక్షం కావడంతో అనుమానాలు మొదలయ్యాయి. అసలే మొన్న పార్లమెంట్ సమావేశాల్లో జగన్ ఆదేశాలకు వ్యతిరేకంగా తెలుగు భాష గురించి మాట్లాడి ఆగ్రహానికి గురయ్యారని టాక్ ఉంది. అందుకే జగన్ ను కలిసి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఇంతలోనే ఆయన బీజేపీ ఆఫీసు దగ్గర కనిపించడం కలకలానికి దారి తీసింది. దాంతో బిజెపి ఎంట్రీ ఇంకెప్పుడు? అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అదే ప్రశ్న ఆయన్ని అడిగితే.. అబ్బే అదేం లేదు.. అంటూ తేల్చేశారు. ఇంకా నాకు ఢిల్లీలో నివాసం కేటాయించలేదు.. దాని గురించి మాట్లాడేందుకు వచ్చానంటూ సర్ది చెప్పేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి