ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. బీజేపీ పక్షంలో చేరి చివరి నిమిషంలో వెనక్కు వచ్చిన నేత అజిత్ పవార్ కు కీలక బాధ్యతలు దక్కనున్నట్లు సమాచారం అందుతోంది. ముంబైలో శరద్ పవార్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అజిత్ పవార్ ను తిరిగి ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారని సమాచారం. శరద్ పవార్ సంకీర్ణ ప్రభుత్వంలో అజిత్ పవార్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 23వ తేదీన నాటకీయ పరిణామాల మధ్య అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు తరువాత నిన్న మధ్యాహ్నం అజిత్ పవార్ పదవికి రాజీనామా చేసి సొంతగూటికి చేరారు. శరద్ పవార్ పార్టీలో అజిత్ పవార్ కు ఇంతకు ముందు ఉన్న స్థానమే కల్పించాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈరోజు నాలుగు గంటల పాటు ఈ విషయం గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జయంత్ పాటిల్ శాసనసభ పక్ష నేతగా ఉండగా జయంత్ పాటిల్ ను తొలగించి శాసనసభ పక్ష నేతగా అజిత్ పవార్ ను ఎన్నుకునే అవకాశాలు ఐతే కనబడుతున్నాయి. బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిశాయి. అన్ని పార్టీలు కొన్ని విషయాల్లో రాజీ పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి.
డిసెంబర్ 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని మొదట ఉద్ధవ్ అనుకున్నా గవర్నర్ సూచనల మేరకు రేపే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు, శివ సేన నేతలు, శరద్ పవార్, అజిత్ పవార్ మంత్రి వర్గ కూర్పులో బిజీగా ఉన్నారని సమాచారం. జయంత్ పాటిల్ డిప్యూటీ సీఎం పదవి వస్తుందని ఆశించారు. శరద్ పవార్ జయంత్ పాటిల్ కు నచ్చజెప్పారని సమాచారం అందుతోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి