సచివాలయ తరలింపు ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముహుర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఈ నెల 20వ తేదీ నుంచే దశలవారీగా సచివాలయాన్ని తరలించేందుకు రెడీ అయింది. మరోవైపు ఈ నెలాఖరులోపే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి మూడు రాజధానుల ఏర్పాటు.. సచివాలయ తరలింపు అంశానికి ఆమోదం తెలపనుంది.
ఏపీ రాజధాని విభజనకు వేగంగా పావులు కదుపుతోంది జగన్ ప్రభుత్వం. ఓ వైపు క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు ఊపందుకుంటున్న తరుణంలో.. వీలైనంత త్వరగా తరలింపు ప్రక్రియను స్పీడప్ చేసేందుకు స్కెచ్ సిద్దం చేస్తోంది సర్కార్. అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20వ తేదీ నుంచి రాజధాని విభజన ప్రక్రియకు.. సచివాలయ తరలింపు ప్రక్రియకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు కీలకమైన విభాగాలను ముందుగా షిఫ్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సచివాలయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కీలకమైన ప్రభుత్వ శాఖల్లోని ముఖ్యమైన విభాగాలకు చెందిన నలుగురేసి ఉద్యోగులను ఆన్ డ్యూటీ కింద అక్కడికి తరలించి ముందుగా కార్యకలాపాలను తరలించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాధారణ పరిపాలన శాఖ నుంచి మూడు, ఆర్ధిక శాఖ, వైద్యారోగ్య శాఖ, రహదారులు భవనాల శాఖ, జలవనరులు, పంచాయితీరాజ్, పురపాలక, విద్యాశాఖలకు చెందిన రెండేసి విభాగాల చొప్పున విశాఖకు తరలించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
మొత్తం 34 విభాగాల నుంచి తొలివిడతలో పరిమిత సంఖ్యలో ఉద్యోగులను తరలించి అక్కడ ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు న్యాయ పరంగా ఎలాంటి చిక్కులు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నట్టు సమాచారం. సచివాలయ తరలింపు ప్రక్రియ ప్రారంభమయ్యేలోగానే తరలింపు ప్రక్రియకు అవసరమైన విధంగా కెబినెట్ ఆమోదం తీసుకోవడంతోపాటు.. అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించే దిశగా ప్రభుత్వం తన ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. బహుశా ఈ నెల 18వ తేదీన కెబినెట్ సమావేశాన్ని నిర్వహించి.. ఆ తర్వాత 20 లేదా ఆ తర్వాత తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జీఎన్ రావు కమిటీ, బీసీజీ సంస్థ ఇచ్చిన నివేదికలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ కూడా 18వ తేదీలోగానే తన నివేదికను ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఓ వైపు తరలింపు ప్రక్రియకు రంగం సిద్దం చేసుకుంటూనే.. మరోవైపు కెబినెట్, అసెంబ్లీల్లో ఆమోద ముద్ర వేసే దిశగా ప్రభుత్వం తన కసరత్తును ముమ్మరం చేస్తోన్నట్టు కన్పిస్తోంది. మరో వైపు జనవరి 26వ తేదీన జరిగే రిప్లబిక్ డే పరేడు కూడా విశాఖలోనే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. విశాఖ మిలీనియం టవర్స్ లో సచివాలయం కొలువు దీరే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి