తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు మొదలైంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మున్సిపల్ ఎన్నికల్లో పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గద్వాల, మంథిర ప్రాంతాలలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్ లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.     
 
తెరాస పార్టీ కార్యకర్త ఒకరు ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కళానగర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస పార్టీ అభ్యర్థికి చెందిన ఒక వ్యక్తి ఓటర్లను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు పంచుతుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరియు కార్యకర్తలు అతడిని అడ్డుకొని పట్టుకోవడంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. 
 
సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ లో పోలింగ్ సిబ్బంది అరకొర వసతుల వలన ఇబ్బందులు పడుతున్నారు. 11వ నంబర్ పోలింగ్ కేంద్రంలో నేలపై కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. మంచిర్యాలలో తెరాస కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ఇరు వర్గాలను అక్కడినుండి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది. వరంగల్ రూరల్ లోని వర్ధన్నపేటలో విద్యుత్ సరఫరా లేకపోవటంతో చీకటిలోనే పోలింగ్ జరుగుతోంది. 
 
గద్వాల్ లో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ జరిగిన గొడవల్లో మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ శంకర్ కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. 55 వేల మంది సిబ్బంది మున్సిపల్ ఎన్నికల విధుల్లో పాల్గొంటుండగా 50 వేల మంది పోలీస్ సిబ్బందితో ఎన్నికల నిర్వహణ కొరకు బందోబస్త్ ఏర్పాటు చేశారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: