మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇకనుండి మహారాష్ట్ర రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు శనివారం, ఆదివారం ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం ఐదు రోజులే డ్యూటీ అనే శుభవార్తను చెప్పినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊహించని ట్విస్ట్ ఒకటి ఇచ్చింది. 
 
ప్రభుత్వ ఉద్యోగులు ఇకనుండి రోజుకు మరో 45 నిమిషాల సమయంపాటు ప్రతిరోజు అదనంగా పని చేసే విధంగా ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది. నిన్న సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో జరిగిన కేబినేట్ సమావేశంలో కేబినేట్ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన ప్రకారం దాదాపు 20 లక్షల మందికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. 
 
పాత పనిగంటల ప్రకారం ఉద్యోగులు 9.45 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పని చేస్తుండగా కొత్త పని గంటల ప్రకారం 9.45 నుండి 6.15 వరకు పని చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వలన ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడపొచ్చని పెట్రోల్, డీజిల్, విద్యుత్, నీటి ఖర్చులు ఆదా అవుతాయని చెబుతోంది. ఐదు రోజుల పనిదినాలు ముఖ్యమైన సేవలకు మాత్రం వర్తించవని ప్రభుత్వం తెలిపింది. 
 
పారిశుద్ధ్య కార్మికులు, పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ కళాశాలలు, అగ్నిమాపకదళం, పోలీసులు, కార్మికులులాంటి ముఖ్య శాఖలకు మాత్రం ఐదు రోజుల పనిదినాలు వర్తించవని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఐదు రోజుల పనిదినాలు అమలులో ఉన్నాయి. దేశంలో ఐదు రోజుల పనిదినాలను అమలు చేయనున్న ఏడవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది.                 

మరింత సమాచారం తెలుసుకోండి: