తెలంగాణ పభుత్వం నిరుద్యోగ యువతకు షాక్ ఇచ్చింది. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిలో ప్రభుత్వం బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. ఆర్థిక బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఎంతో కాలం నుండి ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. నిజానికి కేసీఆర్ ఈ పథకం గురించి ముందే స్పష్టత ఇచ్చారు. ఈ బడ్జెట్లో నిరుద్యోగ భృతికి కేటాయింపులు చేయడం లేదని తెలిపారు. 
 
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల వల్లే ప్రభుత్వం నిరుద్యోగ భృతి అమలు చేయడం లేదని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ పథకం అమలు కావడం కష్టమే అని తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో ఈ పథకం అమలు ఇప్పట్లో లేనట్లే అని కేసీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 
 
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు ప్రకటన చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో నెలకు 3,016 రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పథకం ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. 
 
ప్రభుత్వం ఈ పథకాన్ని గతంలోనే అమలు చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈ పథకానికి ప్రభుత్వం విధివిధానాలను రూపొందించాల్సి ఉంది. అధికారుల అంచనాల ప్రకారం రాష్ట్రంలో 14 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరో వర్గం అంచనాల ప్రకారం ఈ సంఖ్య 20 లక్షల మందికి పైనే ఉండవచ్చని తెలుస్తోంది. ఏపీలో టీడీపీ నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసినా వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపివేసింది.               

మరింత సమాచారం తెలుసుకోండి: