విద్యుత్ ఛార్జీలు పెంచుతామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. సంస్థలు బతకాలంటే.. ఛార్జీలు పెంచక తప్పదన్నారు. అటు గ్రామ పంచాయితీలు, మున్సిపాల్టీలు కూడా సొంత ఆదాయం పెంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి. సౌకర్యాలు కావాలంటే ప్రజలు కూడా సహకరించాలని కోరారు కేసీఆర్. 

 

విద్యుత్‌ సంస్థలు బతకాలంటే ఛార్జీలు పెంచక తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. శాసనసభలో పల్లెప్రగతిపై చర్చలో మాట్లాడిన కేసీఆర్..  పేదలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతామని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నులు పెంచక తప్పదన్నారు. పన్నులు చెల్లించే స్థోమత ఉన్నవారికే పన్ను పెంపు వర్తింపు ఉంటుందన్నారు. రాష్ట్రం, నగరాలు, పట్టణాలు, గ్రామాల అభివృద్ధికోసం ఛార్జీల పెంపును భరించాలని ప్రజలను కోరారు.

 

ప్రజలు టీఆర్ఎస్ ను విశ్వసించి ఓట్లు వేసి గెలిపించారన్నారు కేసీఆర్. విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోతే ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓట్ల కోసం భయపడే పరిస్థితిలో తాము లేమన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఒకేవిడతలో చేస్తామని చెప్పారు. కానీ టీఆర్ఎస్ విడతల వారీ రుణమాఫీ హామీనే ప్రజలు నమ్మారని గుర్తుచేశారు కేసీఆర్. ప్రతి  గ్రామానికి 5 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చర్యలు చేపట్టామన్నారు. అన్ని గ్రామాల్లో చెత్త విసర్జన కేంద్రాలు, తాగునీటి వసతి, ట్యాంకర్లు ఇతర సౌకర్యాలు ఉన్నాయని, ప్రతి గ్రామానికీ నర్సరీ ఉందని సభ దృష్టికి తెచ్చారు సీఎం. 

 

 గ్రామాలు బాగుపడాలంటే పంచాయతీలే పనిచేయాలి.. ప్రజలు సహకరించాలని సూచించారు కేసీఆర్. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రజా ప్రతినిధులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పల్లెప్రగతి పర్యవేక్షణ కోసం సీనియర్‌ అధికారులను నియమించాలని, పంచాయతీలకు నిధుల కొరత లేకుండా చూస్తామని చెప్పారు కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ ఛార్జీల పెంపుదలపై ప్రకటన చేయడంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విద్యుత్ ఛార్జీల పెంపుదలను వ్యతిరేకిస్తూ  ఆందోళనకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: