స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా నెలన్నరపాటు వాయిదా వేసిన రాష్ట్రఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై వైసీపీ నేతల దాడి కొనసాగూతూనే ఉంది. నిమ్మ గడ్డ వ్యవహారశైలిని వైసీపీ నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. కొందరైతే.. అన్ని హద్దులూ దాటేస్తున్నారు. అయితే స్పీకర్ గా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న తమ్మినేని సీతారామ్ సైతం నిమ్మగడ్డపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

 

నిమ్మగడ్డ విచక్షణాధికారం పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తామంటే ఇంకా మేమెందుకు.. రావయ్యా.. నిమ్మగడ్డా.. రా.. వచ్చి సీఎం సీట్లో కూర్చిని పరిపాలన చెయ్.. ఇంకా మేమెందుకు.. ఈ ఎన్నికలెందుకు.. ఈ ప్రజాప్రతినిధులు ఎందుకు.. అంటూ నిమ్మగడ్డపై సభాపతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పెద్ద తప్పు చేశారని తమ్మినేని సీతారామ్ అన్నారు.

 

 

కులం పేరుతోనో, ఇంకో పేరుతోనో, ఎవరికో లాభం చేయాలనే ఉద్దేశంతో స్థానిక ఎన్నికలను వాయిదా వేయడం సరికాదని తమ్మినేని సీతారామ్ అన్నారు. ఎన్నికలు నిర్వహించే అధికారం మాత్రమే ఈసి కి ఉంటుందని, నిలుపుదల చేసే అధికారం ఉండదని తమ్మినేని సీతారామ్ అన్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికల కమిషన్ కు అధికారాలు ఉంటాయని చెప్పిందని, అయితే ఎప్పుడైనా ఎన్నికలు వాయిదా వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయాలని ఉందని తమ్మినేని సీతారామ్ గుర్తు చేశారు.

 

 

ముఖ్యమంత్రి అధికారాలను కూడా ఎన్నికల కమిషన్ తీసుకుంటుందా తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సి.ఎస్. ఎన్నికల కమిషన్ బదిలీ చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చర్యను సమర్దిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రపతి ఈ విషయంలో జోక్యం చేసుకుని నిమ్మగడ్డ ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: