మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఈరోజు ఉదయం సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ కు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు గవర్నర్ తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 
 
కాంగ్రెస్ కీలక నేత సింధియా బీజేపీలో చేరడంతో ఆయనకు విధేయులైన 22మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ రాజీనామాలను ఆమోదించారు. కమల్ సర్కార్ బలపరీక్ష నిర్వహించాలని కొందరు బీజేపీ నేతలు కోర్టు మెట్లెక్కగా కోర్టు అందుకు అంగీకరిస్తూ స్పీకర్ కు ఉత్తర్వులు జారీ చేసింది. బలపరీక్షలో నెగ్గడం కష్టమని భావించి కమల్ నాథ్ పదవికి రాజీనామా చేశారు. 
 
కమల్ రాజీనామాతో బీజేపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా వీరితో పాటు నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ సభ్యుడి మద్దతు ఉంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాల వెనుక అమిత్ షా ఉన్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కర్ణాటకలో అమలు చేసిన వ్యూహాలనే మధ్యప్రదేశ్ లోను అమలు చేసింది. 
 
ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను ఆకర్షించే బీజేపీ అనంతరం ఆ ఎమ్మెల్యేలను అధికార పార్టీపై ఉసిగొల్పుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత సింధియాను బీజేపీలో చేర్చుకుని 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించింది. అమిత్ షా వ్యూహాల వల్ల బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షా తన వ్యూహాలతో పలు రాష్ట్రాలలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: